Movie Piracy: రూ. 3,700 కోట్ల నష్టం.. దేశంలోనే అతిపెద్ద పైరసీ ముఠా గుట్టు రట్టు!

CV Anand 3700 Crore Loss Biggest Piracy Gang Busted
  • దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠాను పట్టుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు
  • తెలుగు చిత్ర పరిశ్రమకు సుమారు రూ. 3,700 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా
  • దుబాయ్, నెదర్లాండ్స్, మయన్మార్ కేంద్రంగా జరుగుతున్న పైరసీ కార్యకలాపాలు
  • పాప్‌కార్న్ డబ్బాలు, జేబుల్లో కెమెరాలు పెట్టి థియేటర్లలో రికార్డింగ్
  • శాటిలైట్ కంటెంట్‌ను సైతం హ్యాక్ చేస్తున్న కేటుగాళ్ల ముఠా 
  • ప్రధాన నిందితుడితో సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా సినీ రంగాన్ని దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న పైరసీ భూతంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. దేశంలోనే అతిపెద్దదిగా భావిస్తున్న అంతర్జాతీయ పైరసీ ముఠా గుట్టును రట్టు చేసి, ఆరుగురు కీలక సభ్యులను అరెస్టు చేశారు. ఈ ముఠా కార్యకలాపాల వల్ల కేవలం తెలుగు ఇండస్ట్రీకే సుమారు రూ. 3,700 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు.

ఈ ముఠా అత్యంత పకడ్బందీగా, ఆధునిక టెక్నాలజీని వాడుతూ పైరసీకి పాల్పడినట్లు విచారణలో తేలింది. థియేటర్లలోకి వెళ్లే ఏజెంట్లు పాప్‌కార్న్ డబ్బాలు, చొక్కా జేబులు, కూల్ డ్రింక్ టిన్లలో హై-ఎండ్ కెమెరాలు పెట్టి సినిమాలను చిత్రీకరించేవారు. రికార్డింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ స్క్రీన్ లైట్ కూడా ఆఫ్ అయ్యేలా ప్రత్యేక యాప్‌లను ఉపయోగించడంతో ఎవరికీ అనుమానం వచ్చేది కాదని పోలీసులు తెలిపారు. కొన్నిసార్లు థియేటర్లకు శాటిలైట్ ద్వారా పంపే కంటెంట్ ఐడీ, పాస్‌వర్డ్‌లను కూడా హ్యాక్ చేసి నేరుగా ఒరిజినల్ ప్రింట్లను దొంగిలించినట్లు సీపీ వివరించారు.

ఇటీవల '#సింగిల్' అనే సినిమా పైరసీకి గురైనట్లు అందిన ఫిర్యాదుతో ఈ కేసు దర్యాప్తు మొదలైంది. ఈ క్రమంలో జులై 3న వనస్థలిపురానికి చెందిన జానా కిరణ్ కుమార్ అనే ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా ఈ ముఠా వెనుక ఉన్న అంతర్జాతీయ నెట్‌వర్క్ బయటపడింది. ముఠాలోని కీలక సభ్యులు దుబాయ్, నెదర్లాండ్స్, మయన్మార్ వంటి దేశాల నుంచి తమ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు, పోలీసులకు చిక్కకుండా నెదర్లాండ్స్‌కు చెందిన ఐపీ అడ్రస్‌లను వాడుతున్నట్లు గుర్తించారు. ఏజెంట్లకు చెల్లింపులను క్రిప్టో కరెన్సీ రూపంలో జరిపేవారు.

ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ, "టెలిగ్రామ్ ఛానెల్స్, టొరెంట్స్ ద్వారానే కాకుండా కొత్తగా 'ఎంవో' అనే పద్ధతిలోనూ పైరసీ చేస్తున్నారు. థియేటర్లలో కెమెరాలతో రికార్డ్ చేయడమే కాక, శాటిలైట్‌ సిగ్నల్ ను కూడా హ్యాక్ చేసి పైరసీకి పాల్పడుతుండటం ఆందోళన కలిగించే విషయం. దీనివల్ల నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు" అని అన్నారు. ఈ ముఠా ఇప్పటివరకు తెలుగు, తమిళం, హిందీతో కలిపి సుమారు 40 చిత్రాలను పైరసీ చేసినట్లు ఆయన తెలిపారు.
Movie Piracy
Hyderabad Cyber Crime
CV Anand
Telugu film industry
piracy
anti piracy
film piracy
piracy gang busted
Tollywood
movie leaks

More Telugu News