PoK protests: పీవోకేలో భారీ ఆందోళనలు... హక్కుల కోసం వెల్లువెత్తిన నిరసనలు

PoK Protests Erupt Demanding Freedom from Pakistan
  • అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో షట్టర్ డౌన్, వీల్ జామ్
  • రాజకీయ, ఆర్థిక హక్కులు కోరుతూ ప్రజల ఆందోళన
  • వేలాదిగా బలగాల మోహరింపు, ఇంటర్నెట్ సేవల నిలిపివేత
  • ప్రభుత్వంతో 13 గంటల పాటు సాగిన చర్చలు విఫలం
  • పాకిస్థాన్ చెర నుంచి స్వేచ్ఛ కావాలంటూ హోరెత్తిన నినాదాలు
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. దశాబ్దాలుగా పాకిస్థాన్ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజకీయ, ఆర్థిక అణచివేతను నిరసిస్తూ జనం పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చారు. సోమవారం నుంచి ‘షట్టర్ డౌన్, వీల్ జామ్’ పేరుతో నిరవధిక బంద్‌కు పిలుపునివ్వడంతో పీవోకే వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాకిస్థాన్ బలవంతపు ఆక్రమణ నుంచి తమకు స్వేచ్చ కావాలంటూ ప్రజలు చేస్తున్న నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లుతోంది.

పౌర సమాజ కూటమి అయిన అవామీ యాక్షన్ కమిటీ (ఏఏసీ) ఈ ఆందోళనలకు నాయకత్వం వహిస్తోంది. తమకు దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయంపై గళమెత్తిన ఈ కమిటీ 38 డిమాండ్లతో కూడిన ఒక జాబితాను ప్రభుత్వం ముందుంచింది. పీవోకే అసెంబ్లీలో పాకిస్థాన్‌లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్థుల కోసం కేటాయించిన 12 సీట్లను రద్దు చేయాలన్నది వీరి ప్రధాన డిమాండ్. ఈ సీట్ల వల్ల స్థానిక ప్రజల ప్రాతినిధ్య హక్కు దెబ్బతింటోందని వారు ఆరోపిస్తున్నారు. వీటితో పాటు, గోధుమ పిండిపై సబ్సిడీ ఇవ్వాలని, మంగ్లా జలవిద్యుత్ ప్రాజెక్టు ఆధారంగా విద్యుత్ చార్జీలను తగ్గించాలని కోరుతున్నారు.

"మా పోరాటం ఏ సంస్థకూ వ్యతిరేకం కాదు. 70 ఏళ్లుగా మా ప్రజలకు నిరాకరించిన ప్రాథమిక హక్కుల కోసం మాత్రమే" అని ఏఏసీ కీలక నేత షౌకత్ నవాజ్ మీర్ ముజఫరాబాద్‌లో స్పష్టం చేశారు. "ఇక చాలు. మా హక్కులు మాకు ఇవ్వండి, లేదంటే ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది" అని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

మరోవైపు, ఈ ఆందోళనలను ఇస్లామాబాద్ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేయాలని చూస్తోంది. వేలాదిగా సైనికులను, పోలీసు బలగాలను పంజాబ్ నుంచి తరలించింది. నిరసనకారులు ఒక చోట చేరకుండా నిరోధించేందుకు ఆదివారం అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేసింది. కీలక నగరాల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను మూసివేసి, ప్రధాన పట్టణాల్లో సైనికులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. 

ఆందోళనకు ముందు ఏఏసీ ప్రతినిధులతో ప్రభుత్వం, పీవోకే పరిపాలన అధికారులు 13 గంటల పాటు చర్చలు జరిపినా అవి విఫలమయ్యాయి. తమ ప్రధాన డిమాండ్ల విషయంలో రాజీపడేది లేదని ఏఏసీ తేల్చి చెప్పడంతో చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. ప్రస్తుతం పీవోకేలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరుపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో ఈ నిరసనలు పీవోకే రాజకీయ భవిష్యత్తులో ఒక కీలక మలుపుగా మారే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.
PoK protests
Pakistan occupied Kashmir
Azad Kashmir
Shaukat Nawaz Mir
Awami Action Committee
Mangla Dam
Kashmiri refugees
Gilgit Baltistan
India Pakistan relations
Human rights

More Telugu News