Kamineni Srinivas: బాలయ్య-చిరు వివాదంలో కీల‌క మ‌లుపు!

Chiranjeevi Balakrishna Controversy Takes a Key Turn
  • బాలకృష్ణ, చిరంజీవి మధ్య వివాదానికి తెర
  • సీఎం చంద్రబాబు జోక్యం!
  • అసెంబ్లీ రికార్డుల నుంచి తన వ్యాఖ్యలు తొలగించాలని కామినేని అభ్యర్థన
  • సద్దుమణిగిన వివాదం 
గత కొద్ది రోజులుగా సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన నటులు బాలకృష్ణ, చిరంజీవి మధ్య వివాదానికి తెరపడింది. ఏపీ శాసనసభ వేదికగా మొదలైన ఈ వ్యవహారం, సీఎం చంద్రబాబు జోక్యంతో సద్దుమణిగింది. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరడంతో ఈ వివాదానికి ముగింపు పలికినట్లయింది.

అసలేం జరిగిందంటే..!
ఇటీవల ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సినీ పరిశ్రమ సమస్యలపై మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్‌తో జరిగిన సమావేశం గురించి ప్రస్తావించారు. ఆ భేటీలో చిరంజీవి గట్టిగా మాట్లాడిన తర్వాతే జగన్ నేరుగా చర్చలకు వచ్చారని కామినేని వ్యాఖ్యానించారు. అయితే, అక్కడే ఉన్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వెంటనే స్పందించి, ఆ వ్యాఖ్యలను ఖండించారు. చిరంజీవి గట్టిగా మాట్లాడలేదని ఆయన సభలోనే స్పష్టం చేశారు.

ఈ పరిణామంపై చిరంజీవి బహిరంగంగా వివరణ ఇచ్చారు. తాను జగన్‌తో గట్టిగా మాట్లాడలేదని, ఆయన ఎంతో సాదరంగా ఆహ్వానించి చర్చలు జరిపారని తెలిపారు. ఆ సమావేశానికి తనతో పాటు వచ్చిన సినీ ప్రముఖులే ఇందుకు సాక్ష్యమని పేర్కొన్నారు. ఆ చర్చల ఫలితంగానే తన ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ నటించిన ‘వీర సింహారెడ్డి’ చిత్రాల టికెట్ ధరలు పెరిగాయని గుర్తుచేశారు. ఆనాటి సమావేశానికి బాలకృష్ణను కూడా ఆహ్వానించామని, ఆయన అందుబాటులో లేకపోవడంతో జెమిని కిరణ్‌కు సమాచారం ఇచ్చామని చిరంజీవి వెల్లడించారు.

బాలకృష్ణ వ్యాఖ్యలపై మెగా అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నాగబాబు ఈ అంశంపై స్పందించకపోవడం కూడా చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో వివాదం మరింత ముదరకుండా సీఎం చంద్రబాబు చొరవ తీసుకున్నారు. అసెంబ్లీలో బాలకృష్ణ, కామినేని మధ్య ఆ సంవాదం జరగకుండా ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి సూచనతో, తన వ్యాఖ్యలు అపార్థాలకు దారితీశాయని గ్రహించిన కామినేని శ్రీనివాస్, వాటిని సభా రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది.
Kamineni Srinivas
Chiranjeevi
Balakrishna
AP Assembly
Chandrababu Naidu
Jagan Mohan Reddy
Tollywood
Waltair Veerayya
Veera Simha Reddy
Telugu Cinema

More Telugu News