KTR: ఇంటింటికీ బాకీ కార్డు పంపిస్తాం.. మాజీ మంత్రి కేటీఆర్

BRS Releases Baaki Card to Remind People of Congress Promises KTR
తెలంగాణ భవన్ లో కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల
రాష్ట్రంలో ప్రతీ వర్గానికీ ప్రభుత్వం బాకీపడిందన్న కేటీఆర్
ఎన్నికల ముందు రజనీకాంత్ లా.. ఎన్నికలయ్యాక గజనీకాంత్ లా మారిపోయాడు: హరీశ్ రావు
తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందని, ఏ వర్గానికి ఎంతెంత బాకీ పడిందనే వివరాలను చాటిచెప్పేందుకే బాకీ కార్డును తీసుకొచ్చామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ లో కాంగ్రెస్ బాకీ కార్డును విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీసి తమ బాకీని వసూలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్డును తెలంగాణలోని ఇంటింటికీ చేరుస్తామని చెప్పారు.

తమపై కేసులు నమోదు చేసినా సరే వెనుకాడబోమని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రజలందరికీ గుర్తుచేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హ‌రీశ్‌రావు, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, మ‌హ‌మూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్, ప‌ద్మారావు గౌడ్, మ‌ధుసూద‌నాచారి, జ‌గ‌దీశ్ రెడ్డి, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ల‌క్ష్మారెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర‌తో పాటు ప‌లువురు నేత‌లు పాల్గొన్నారు. 

రేవంత్ రెడ్డి కటింగ్ మాస్టర్: హరీశ్
రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు రజినీకాంత్ లా.. అధికారంలోకి వచ్చాక గజినీకాంత్ లాగా మారిపోయాడని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఆయన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాదు, కటింగ్ మాస్టర్ రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. గత ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులకు రిబ్బన్ కటింగ్ లు చేసి ప్రారంభోత్సవాలు చేస్తున్నాడని, అదే సమయంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన పలు మంచి పథకాలను కట్ చేశాడని హరీశ్ రావు ఆరోపించారు.
 
బాకీ కార్డులో ఏమున్నాయంటే..
మ‌హిళ‌ల‌కు రూ.2500 హామీ కింద ఒక్కొక్క‌రికి రూ.55 వేలు, వృద్ధులకు పెన్ష‌న్ నెల‌కు రూ.4 వేల హామీ కింద ఒక్కొక్క‌రికి రూ.44 వేలు, విక‌లాంగుల‌కు పెన్ష‌న్ రూ.6 వేల హామీ కింద ఒక్కొక్క‌రికి రూ.44 వేలు, షాదీ ముబార‌క్, క‌ల్యాణ‌ల‌క్ష్మి కింద ఆడ‌బిడ్డ‌ల పెళ్లిళ్ల‌కు తులం బంగారం, నిరుద్యోగుల‌కు 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు, విద్యార్థినుల‌కు స్కూటీ, విద్యా భ‌రోసా కార్డ్ కింద విద్యార్థుల‌కు ఒక్కొక్క‌రికి రూ.5 ల‌క్ష‌లు కాంగ్రెస్ ప్ర‌భుత్వం బాకీ ప‌డిన‌ట్లు బీఆర్ఎస్ నేతల ఈ బాకీ కార్డులో ఆరోపించారు.
KTR
K Taraka Rama Rao
BRS
Telangana Congress
Revanth Reddy
Harish Rao
Telangana Politics
Congress Baaki Card
Telangana Elections
Debt Card

More Telugu News