Private Travels: పండక్కి ఊరెళ్లేదెలా?.. ప్రైవేటు ట్రావెల్స్ ఛార్జీల మోత!

Private Travels Hike Bus Fares for Dasara Festival
  • దసరా పండగ సందర్భంగా ప్రైవేటు బస్సుల ఛార్జీల మోత
  • మూడింతలు పెంచి ప్రయాణికులపై పెను భారం
  • విశాఖకు బస్సు ఛార్జీ విమాన టికెట్ ధరతో సమానం
  • నియంత్రణలో విఫలమవుతున్న రవాణా శాఖ అధికారులు
  • ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లోనూ 50 శాతం అదనపు ఛార్జీలు
దసరా పండగ వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు చుక్కలు చూపిస్తున్నారు. పండగ రద్దీని అవకాశంగా మలుచుకుని టికెట్ ధరలను అడ్డూ అదుపూ లేకుండా పెంచేస్తున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే ఛార్జీలు రెండు నుంచి మూడు రెట్లు అధికంగా ఉండటంతో ప్రయాణికుల జేబులకు భారీగా చిల్లు పడుతోంది. కొన్ని మార్గాల్లో అయితే బస్సు ఛార్జీలు ఏకంగా విమాన టికెట్ల ధరలతో పోటీ పడుతుండటం గమనార్హం.

హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు అక్టోబరు 1న విమాన టికెట్ ధర రూ.4000 నుంచి రూ.4200 మధ్య ఉండగా, అదే రోజున ఏసీ స్లీపర్ బస్సుల్లో రూ.3800 నుంచి రూ.4000 వరకు వసూలు చేస్తున్నారు. సాధారణ రోజుల్లో రూ.1200 వరకు ఉండే రైలు థర్డ్ ఏసీ ఛార్జీతో పోలిస్తే ఇది దాదాపు మూడింతలు అధికం. 

ఇక నాన్-ఏసీ బస్సుల్లోనూ రూ.2,700 వరకు వసూలు చేస్తుండటంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం విశాఖకే కాకుండా విజయవాడ, కాకినాడ, రాజమహేంద్రవరం, తిరుపతి, కడప వంటి ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సాధారణ రోజుల్లో రూ.600 ఉండే కడప టికెట్ ధరను రెట్టింపు చేశారు.

పండగ సీజన్‌లో రైళ్లన్నీ రెండు నెలల ముందే పూర్తిగా నిండిపోవడం, ఆర్టీసీ నడిపే ప్రత్యేక బస్సులు డిమాండ్‌కు సరిపడా లేకపోవడంతో ప్రయాణికులకు ప్రైవేటు బస్సులే దిక్కవుతున్నాయి. ఈ బలహీనతను ఆసరాగా చేసుకుంటున్న ప్రైవేటు ఆపరేటర్లు, డిమాండ్‌ను బట్టి ఎప్పటికప్పుడు ధరలను పెంచుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ముందే టికెట్ బుక్ చేసుకున్నా, చివరి నిమిషంలో ప్రయత్నించినా అధిక ఛార్జీల భారం తప్పడం లేదు.

ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అద‌న‌పు ఛార్జీలు
మరోవైపు, పండగ వేళ నడిపే ప్రత్యేక బస్సులపై సాధారణ ఛార్జీల కన్నా 50 శాతం అదనంగా వసూలు చేసేందుకు ఆర్టీసీకి ప్రభుత్వం అనుమతివ్వడం ప్రైవేటు ఆపరేటర్లకు మరింత కలిసొచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీనే ధరలు పెంచుతున్నప్పుడు తాము పెంచడంలో తప్పేముందన్న ధోరణితో వారు వ్యవహరిస్తున్నారు. సామర్థ్య ధృవీకరణ, బీమా వంటి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్న రవాణా శాఖ అధికారులు, అధిక ఛార్జీల వసూళ్లపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


Private Travels
Dasara Festival
Hyderabad to Visakhapatnam
Bus Ticket Prices
APSRTC
Festival Travel
Vijayawada
Kakinada
Rajamahendravaram
Kadapa

More Telugu News