Harish Rao: ముందే హెచ్చరించినా పట్టించుకోలేదు.. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దుస్థితి: హరీశ్‌రావు

Harish Rao blames government failure for Hyderabad floods
  • హైదరాబాద్ వరదలపై సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
  • ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని తీవ్ర విమర్శ
  • వాతావరణ శాఖ హెచ్చరికలను పట్టించుకోలేదని ఆరోపణ
  • ఎంజీబీఎస్‌లో చిక్కుకున్న ప్రయాణికులను ఆదుకోవాలని డిమాండ్
  • మూసీ పరిసర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచన
  • బురద రాజకీయాలు పక్కనపెట్టి సహాయ చర్యలు చేపట్టాలన్న హరీశ్‌
భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం జల దిగ్బంధంలో చిక్కుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదని, నేరపూరిత నిర్లక్ష్యమని ఆయన ఘాటుగా విమర్శించారు. వాతావరణ శాఖ ముందుగానే తీవ్ర వర్షాలు కురుస్తాయని హెచ్చరించినా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం అప్రమత్తంగా వ్యవహరించలేదని ఆయన మండిపడ్డారు.

వరద తీవ్రతను అంచనా వేయడంలో, ప్రణాళికలు రచించడంలో, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం సాధించడంలో సర్కారు పూర్తిగా విఫలమైందని హరీశ్‌రావు ఆరోపించారు. ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకపోవడం దుర్మార్గమని అన్నారు. ప్రభుత్వ ముందుచూపు లోపం వల్లే పండుగ వేళ ఊళ్లకు వెళ్లే ప్రయాణికులు ఎంజీబీఎస్ బస్టాండులో వరద నీటిలో చిక్కుకుని రాత్రంతా భయంతో గడపాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

మూసీ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో పరీవాహక ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారని హరీశ్‌రావు తెలిపారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బురద రాజకీయాలను కాసేపు పక్కనపెట్టి, సహాయక చర్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. వరదల్లో చిక్కుకున్న ప్రయాణికులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేశారు.

మూసీ పరిసర ప్రాంతాల్లో ముంపునకు గురయ్యే ప్రజలను గుర్తించి, వారికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలించి భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు.
Harish Rao
Hyderabad floods
Telangana rains
Revanth Reddy
MGBS bus stand
Moosi river
Telangana government
Heavy rainfall
Weather warning

More Telugu News