Neuro implants: పాల ఉత్పత్తిని పెంచేందుకు ఆవుల్లో న్యూరో ఇంప్లాంట్!

Neuro implants for milk production increase in cows
  • పాల ఉత్పత్తి పెంచేందుకు ఆవుల మెదడులో చిప్స్
  • రష్యాకు చెందిన నీరీ సంస్థ వినూత్న ప్రయోగం
  • ఇప్పటికే ఐదు ఆవులపై విజయవంతంగా పరీక్షలు పూర్తి
  • ఆకలి, ఒత్తిడిని నియంత్రించేలా చిప్స్ పనితీరు
  • జంతువులకు ప్రమాదకరం, ఖర్చు ఎక్కువంటున్న నిపుణులు
  • త్వరలోనే వాణిజ్యపరంగా అందుబాటులోకి తెస్తామంటున్న కంపెనీ
పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచే లక్ష్యంతో రష్యాకు చెందిన ‘నీరీ’ అనే సంస్థ సరికొత్త టెక్నాలజీకి శ్రీకారం చుట్టింది. ఆవుల మెదడులో నేరుగా న్యూరో-ఇంప్లాంట్లను (బ్రెయిన్ చిప్స్) అమర్చి, వాటి ద్వారా పాల దిగుబడిని నియంత్రించేందుకు ప్రయోగాలు ప్రారంభించింది. రష్యాలోని స్వెర్డ్‌లోవ్స్క్ ప్రాంతంలో ఇప్పటికే ఐదు ఆవులపై ఈ పరీక్షలను విజయవంతంగా నిర్వహించినట్లు కంపెనీ ప్రకటించింది.

ఈ ప్రక్రియలో, ఆవు తల వెనుక భాగంలో ఒక స్టిమ్యులేటర్‌ను అమర్చి, దాని నుంచి వచ్చే ఎలక్ట్రోడ్లను మెదడులోని కీలక భాగాలకు అనుసంధానిస్తారు. ఈ చిప్స్ ద్వారా విద్యుత్ సంకేతాలను పంపి ఆవుల ఆకలి, ఒత్తిడి, పునరుత్పత్తి వ్యవస్థలను నియంత్రించవచ్చని నీరీ సంస్థ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉదాహరణకు, ఒక ఆవుకు ఆకలి మందగిస్తే, ఈ సిస్టమ్ ద్వారా మెదడును ఉత్తేజపరిచి తిరిగి ఆకలి పెరిగేలా చేయవచ్చు. శస్త్రచికిత్స సమయంలో ఆవులు స్పృహలోనే ఉన్నాయని, ప్రక్రియ తర్వాత ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా తిరిగి తమ పనుల్లో నిమగ్నమయ్యాయని రియా నోవోస్టి వార్తా సంస్థ నివేదించింది.

ప్రస్తుతం పాడి పరిశ్రమలో ఉత్పత్తిని పెంచడానికి ఉన్న మార్గాలన్నీ ఇప్పటికే వాడుకలో ఉన్నాయని, తమ న్యూరో-ఇంప్లాంట్ టెక్నాలజీ ఈ రంగంలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకువస్తుందని నీరీ ఇన్వెస్టర్ అలెక్సీ మరిజా విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ టెక్నాలజీతో తమకు మార్కెట్లో బలమైన పోటీనిచ్చే అవకాశం లభిస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ చిప్స్‌ను మెరుగుపరిచే పనిలో ఉన్నామని, త్వరలోనే వీటిని వాణిజ్యపరంగా మార్కెట్లోకి విడుదల చేస్తామని కంపెనీ తెలిపింది.

అయితే, నీరీ సంస్థ ప్రయోగాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్టెప్పీ అగ్రికల్చరల్ హోల్డింగ్ జనరల్ డైరెక్టర్ ఆండ్రీ నెడుజ్కో ఈ టెక్నాలజీని విమర్శించారు. ఈ ఇంప్లాంట్ల వల్ల జంతువుల ఆరోగ్యానికి అనవసరమైన ముప్పు వాటిల్లుతుందని, పైగా వీటి ధర చాలా ఎక్కువగా ఉండటం వల్ల లాభదాయకం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, ఈ విమర్శలను నీరీ సంస్థ తోసిపుచ్చింది. తమ ఉత్పత్తుల ధరలను గణనీయంగా తగ్గించే మార్గాలను ఇప్పటికే గుర్తించామని, ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ ఆపరేటింగ్ రూమ్‌లలో ఇంప్లాంటేషన్ ప్రక్రియను పూర్తిచేస్తామని వివరించింది.
Neuro implants
Dairy farming
Milk production
Brain chips
Russia
Sverdlovsk
Agriculture technology
Animal health
NIRI

More Telugu News