H-1B Visa: హెచ్-1బీ వీసా.. కరిగిపోతున్న డాలర్ డ్రీమ్స్.. ఇదే వీసాతో ఎదిగిన మస్క్, సత్య నాదెళ్ల, పిచాయ్

Elon Musk Nadella Pichai H 1B Visa Success Stories
  • హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
  • గతంలో 2000 నుంచి 5000 డాలర్ల మధ్య ఉన్న ఈ వీసా ఫీజు
  • ట్రంప్ నిర్ణయంతో భారతీయుల అమెరికన్ కల చెదిరిపోనుందనే విమర్శలు
  • ఈ నిర్ణయం కంపెనీలకు ఆర్థికంగా భారమంటూ అమెరికా వాణిజ్య కార్యదర్శి వ్యాఖ్య
ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలోని లక్షలాది మంది సాంకేతిక నిపుణుల జీవితాలను మార్చేసిన హెచ్-1బీ వీసా కార్యక్రమంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎందరో భారతీయులకు "అమెరికన్ డ్రీమ్"కు ప్రవేశ ద్వారంగా నిలిచిన ఈ వీసా ఫీజును అమాంతం లక్ష డాలర్లకు పెంచుతూ సెప్టెంబర్ 21న ప్రకటన విడుదల చేశారు. 

గతంలో కేవలం 2,000 నుంచి 5,000 డాలర్ల మధ్య ఉన్న ఈ ఫీజును ఇంత భారీగా పెంచడం టెక్ పరిశ్రమలో, వలసదారుల వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నిర్ణయం... ప్రపంచ టెక్ రంగాన్ని ఏలుతున్న ఎలాన్ మస్క్, సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ వంటి దిగ్గజాలు సైతం ఒకప్పుడు ఇదే వీసాపై ఆధారపడి అమెరికాలో తమ ప్రస్థానాన్ని ప్రారంభించారన్న వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చింది. 

అమెరికా సాంకేతిక ఆధిపత్యానికి పునాదులు వేసిన ఈ వీసా కార్యక్రమాన్ని కఠినతరం చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇది మానవతా సంక్షోభానికి దారితీయవచ్చని హెచ్చరించింది.

అయితే, ఈ నిర్ణయం అమెరికా టెక్ పరిశ్రమపై దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా పౌరసత్వం, వలస సేవల (USCIS) గణాంకాల ప్రకారం, ఆమోదం పొందిన మొత్తం హెచ్-1బీ దరఖాస్తులలో 71 శాతం భారతీయులే ఉన్నారు. ఇప్పుడు ఈ కొత్త ఫీజు విధానం వల్ల చిన్న, మధ్య తరహా టెక్ కంపెనీలు విదేశీ ప్రతిభను ఆకర్షించడం దాదాపు అసాధ్యంగా మారనుంది. కేవలం అతిపెద్ద టెక్ కంపెనీలు మాత్రమే ఈ భారాన్ని మోయగలవు. ఇది ఆవిష్కరణల వేగాన్ని తగ్గించడమే కాకుండా, అమెరికాలో నైపుణ్యాల కొరతకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందరో భారతీయ విద్యార్థులు అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించి, ఆ తర్వాత హెచ్-1బీ వీసా ద్వారా అక్కడే స్థిరపడాలని కలలు కంటారు. ఈ నిర్ణయం వారి ఆశలపై నీళ్లు చల్లినట్టయింది.

టెక్ దిగ్గజాలను నిలబెట్టిన హెచ్-1బీ వీసా:

నేడు ప్రపంచ సాంకేతిక రంగాన్ని శాసిస్తున్న ముగ్గురు కీలక వ్యక్తులు తమ కెరీర్ తొలినాళ్లలో హెచ్-1బీ వీసాపైనే ఆధారపడటం గమనార్హం. ఈ వీసా కార్యక్రమం అమెరికాకు ఎంతటి మేధో సంపత్తిని అందించిందో చెప్పడానికి వారి విజయగాథలే నిదర్శనం.

ఎలాన్ మస్క్:

ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా అవతరించే అవకాశం ఉన్న ఎలాన్ మస్క్.. టెస్లా, స్పేస్‌ఎక్స్, న్యూరాలింక్, ఎక్స్ కార్ప్ వంటి విప్లవాత్మక కంపెనీలను నిర్మించారు. ఆయన ప్రపంచ నలుమూలల నుంచి అత్యుత్తమ టెక్ నిపుణులను తన కంపెనీలలో నియమించుకున్నారు. మస్క్ తొలుత జే-1 ఎక్స్ఛేంజ్ వీసాపై అమెరికాలోకి ప్రవేశించి, ఆ తర్వాత తన విద్య, వ్యాపార కార్యకలాపాల కోసం హెచ్-1బీ వీసాకు మారారు.

ఈ వీసా ప్రాముఖ్యత గురించి ఆయన గతంలో గట్టిగా వాదించారు. డిసెంబర్ 28న ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ, "స్పేస్‌ఎక్స్, టెస్లాతో పాటు అమెరికాను బలోపేతం చేసిన వందలాది కంపెనీలను నిర్మించిన ఎందరో కీలక వ్యక్తులతో పాటు నేను కూడా అమెరికాలో ఉండటానికి కారణం హెచ్-1బీ వీసానే" అని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ విషయంపై తీవ్ర పదజాలంతో స్పందిస్తూ, "ఈ అంశంపై నేను ఊహించని స్థాయిలో యుద్ధం చేస్తాను" అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

సత్య నాదెళ్ల: 

మైక్రోసాఫ్ట్ సీఈఓగా కంపెనీని కొత్త శిఖరాలకు చేర్చిన సత్య నాదెళ్ల, 1990లలో తన కెరీర్‌ను హెచ్-1బీ వీసా కిందనే ప్రారంభించారు. ప్రపంచ ప్రతిభను ఆకర్షించడానికి ఈ కార్యక్రమం ఎంత ముఖ్యమో ఆయన పలుమార్లు నొక్కిచెప్పారు. ఆవిష్కరణలు, ఆర్థిక వృద్ధికి ఇది అత్యంత కీలకమని,  హెచ్-1బీ కేవలం ఒక వ్యక్తికి ఉద్యోగం కల్పించే వీసా మాత్రమే కాదని, అది అమెరికా ఆర్థిక వ్యవస్థకు, దాని ̄̄ద్వారా ప్రపంచ ఆధిపత్యానికి ఎంతగానో దోహదపడుతుందని ఆయన విశ్వసిస్తారు.

సుందర్ పిచాయ్:

ఆల్ఫాబెట్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా అమెరికాకు అంతర్జాతీయ విద్యార్థిగా వచ్చి, ఆ తర్వాత హెచ్-1బీ వీసాకు మారారు. వలసదారుల హక్కుల కోసం, వారి అవకాశాల కోసం ఆయన నిరంతరం తన గళాన్ని వినిపిస్తూ ఉంటారు.

జూన్ 23, 2020న, అప్పటి ట్రంప్ ప్రభుత్వం వలసదారుల వర్క్ వీసాలను నిలిపివేస్తూ జారీ చేసిన ప్రకటనపై ఆయన తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ఎక్స్‌లో ఆయన స్పందిస్తూ, "అమెరికా ఆర్థిక విజయంలో వలసలు అపారమైన సహకారం అందించాయి. టెక్నాలజీలో ప్రపంచ అగ్రగామిగా నిలబెట్టాయి. అలాగే గూగుల్ ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి కూడా అవే కారణం. తాజా ప్రకటన నన్ను నిరాశపరిచింది. మేము వలసదారులకు అండగా నిలుస్తాము, అందరికీ అవకాశాలను విస్తరించేందుకు కృషి చేస్తాము" అని పేర్కొన్నారు.

పిచాయ్ నాయకత్వంలో గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్, పిక్సెల్ ఫోన్లు వంటి హార్డ్‌వేర్ రంగాలలో అద్భుతమైన ఆవిష్కరణలు చేసింది. ఈ విజయాల వెనుక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన ఉద్యోగుల కృషి ఉందని ఆయన పదేపదే చెబుతారు.

కాగా,  ఈ విషయంపై దౌత్యపరమైన మార్గాల్లో చర్చలు జరిపి, ఒక పరిష్కారం కనుగొనాలని భారత్ ప్రయత్నిస్తోంది.
H-1B Visa
Donald Trump
Elon Musk
Satya Nadella
Sundar Pichai
USCIS
Indian IT Professionals
US Immigration
Tech Industry
Visa Fee Hike

More Telugu News