Donald Trump: మైక్రోసాఫ్ట్‌కు ట్రంప్ అల్టిమేటం... ఆమెను వెంటనే తీసేయండి!

Trump asks Microsoft to fire Global Affairs Head Lisa Monaco
  • మైక్రోసాఫ్ట్ అధికారిణి లీసా మొనాకోను తొలగించాలన్న ట్రంప్
  • ఆమె అవినీతిపరురాలు, జాతీయ భద్రతకు ముప్పు అంటూ తీవ్ర ఆరోపణలు
  • బైడెన్ హయాంలో పనిచేయడమే ఆమెపై ఆగ్రహానికి కారణం
  • తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్ట్ పెట్టిన అమెరికా అధ్యక్షుడు
  • ప్రభుత్వ కాంట్రాక్టులున్న కంపెనీలో ఆమె ఉండటంపై అభ్యంతరం
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఆ సంస్థలో గ్లోబల్ అఫైర్స్ హెడ్‌గా పనిచేస్తున్న లీసా మొనాకోను తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. లీసా మొనాకో ఒక "అవినీతిపరురాలు" అని, ఆమె "అమెరికా జాతీయ భద్రతకు పెను ముప్పు" అని ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు.

తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ట్రూత్ సోషల్' వేదికగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. "ప్రభుత్వం నుంచి మైక్రోసాఫ్ట్ కీలక కాంట్రాక్టులు పొందుతోంది. అలాంటి సంస్థలో ఉన్న లీసాకు అత్యంత సున్నితమైన సమాచారం అందుబాటులో ఉంటుంది. ఆమెను అస్సలు నమ్మలేం" అని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా, తాను ఇప్పటికే మొనాకోకు ఉన్న భద్రతా అనుమతులను రద్దు చేశానని, ప్రభుత్వ కార్యాలయాల్లోకి ఆమె ప్రవేశాన్ని నిషేధించానని ఆయన వెల్లడించారు.

ఈ ఏడాది మే నెలలోనే లీసా మొనాకో మైక్రోసాఫ్ట్‌లో చేరారు. అంతకుముందు ఆమె జో బైడెన్ ప్రభుత్వంలో 39వ డిప్యూటీ అటార్నీ జనరల్‌గా అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్ కింద పనిచేశారు. బైడెన్ యంత్రాంగంలో కీలక బాధ్యతలు నిర్వర్తించడమే ప్రస్తుతం ట్రంప్ ఆగ్రహానికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, మైక్రోసాఫ్ట్‌లో ఆమె పాత్ర గురించి ట్రంప్ దృష్టికి ఇప్పుడే వచ్చి ఉండవచ్చని, అందుకే ఈ సమయంలో ఆమెను లక్ష్యంగా చేసుకున్నారని కొన్ని నివేదికలు అభిప్రాయపడ్డాయి.

ఇటీవలి కాలంలో హెచ్‌1బీ వీసాలపై ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో మైక్రోసాఫ్ట్ వంటి టెక్ కంపెనీలు అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నెల‌ 21 నుంచి హెచ్‌1బీ వీసాలపై లక్ష డాలర్ల ఫీజు అమల్లోకి రానుండటంతో విదేశాల్లో ఉన్న తమ ఉద్యోగులు వెంటనే వెనక్కి వచ్చేయాలని మైక్రోసాఫ్ట్ సూచించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Donald Trump
Microsoft
Global Affairs Head
Lisa Monaco

More Telugu News