DSP Nalini: నా విషయం తేల్చకుంటే జీవసమాధి అవుతాను: మాజీ డీఎస్పీ నళిని

DSP Nalini warns of Jeeva Samadhi if issue unresolved
  • నవమి లోపు తన విషయం తేల్చకుంటే మరణమే శరణ్యమని వ్యాఖ్య
  • తన విషయం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని విమర్శ
  • సంధ్య ఘటనలో రేవతి కుటుంబాన్ని ఆదుకోవడానికి వారం రోజులు కూడా పట్టలేదని వ్యాఖ్య
వచ్చే నవమి లోపు తన విషయం తేల్చకపోతే మరణమే శరణ్యమని, జీవసమాధి అవుతానని మాజీ డీఎస్పీ నళిని అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆమె తన పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే. మరణ వాంగ్మూలం పేరుతో ఆమె తన సామాజిక మాధ్యమాల్లో గత వారం రోజులగా పలు పోస్టులు పెడుతూ వస్తున్నారు. తాజాగా శుక్రవారం మరో పోస్టును విడుదల చేశారు.

తన సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. తన మరణ వాంగ్మూలాన్ని ఆర్డీవోతో నమోదు చేయించడం మినహా ఇప్పటివరకు చేసిందేమీ లేదని విమర్శించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవడానికి వారికి వారం రోజులు కూడా పట్టలేదని, కానీ తన విషయంలో సంవత్సరాల తరబడి కావాలనే జాప్యం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఏ అధికారిని అయినా సస్పెండ్ చేస్తే ఆరు నెలల్లోపు విచారణ పూర్తి చేయాలని ఆమె తెలిపారు. విచారణ సమయంలో 1/3 లేదా 1/2 జీతాన్ని జీవన భృతి కింద ఇవ్వవలసి ఉంటుందని అన్నారు. అలా ఇవ్వకపోవడం నేరం కిందకు వస్తుందని ఆమె పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి తాను 21 నెలల కిందట ఇచ్చిన నివేదికపై ఇంకా చర్యలు తీసుకోకుండా ఉన్నారని ఆమె వాపోయారు.
DSP Nalini
Revanth Reddy
Telangana
Telangana ఉద్యమం
Sadhya Theater
జీవసమాధి
జీవన భృతి
తెలంగాణ ఉద్యమం
నళిని
రేవంత్ రెడ్డి

More Telugu News