Falaknuma Express: ఉగ్రవాదులు ఉన్నారంటూ సమాచారం.. సికింద్రాబాద్ వెళుతున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు

Falaknuma Express Checked After Terrorist Threat in Secunderabad
  • ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్‌లో రైలును నిలిపివేసిన పోలీసులు
  • రంగంలోకి దిగిన ఆర్పీఎఫ్, జీఆర్పీ, ప్రత్యేక బృందాలు
  • ప్రతి బోగీలో ప్రయాణికుల లగేజీ క్షుణ్ణంగా తనిఖీ
  • గంటకు పైగా సోదాల తర్వాత సికింద్రాబాద్‌కు రైలు పయనం
  • ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారణతో ఊపిరి పీల్చుకున్న అధికారులు
హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం తీవ్ర కలకలం రేపింది. అప్రమత్తమైన రైల్వే, స్థానిక పోలీసులు రైలును ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్‌లో నిలిపివేసి విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ ఆకస్మిక పరిణామంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు చర్లపల్లి ఆర్పీఎఫ్, జీఆర్పీ, ఘట్‌కేసర్ పోలీసులతో కూడిన ప్రత్యేక బృందాలు ఈ ఉదయం రంగంలోకి దిగాయి. ఘట్‌కేసర్ స్టేషన్‌లో రైలును ఆపిన వెంటనే ప్రతి బోగీలోకి ప్రవేశించి అణువణువునా సోదాలు నిర్వహించారు. అనుమానం వచ్చిన ప్రతి వ్యక్తిని ప్రశ్నించడంతో పాటు, వారి వెంట ఉన్న లగేజీని క్షుణ్ణంగా పరిశీలించారు.

సుమారు గంటకు పైగా కొనసాగిన ఈ తనిఖీలతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. చివరకు, రైలులో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గానీ, వ్యక్తులు గానీ లేరని పోలీసులు నిర్ధారించుకున్నారు. అనంతరం రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ స్టేషన్‌కు బయలుదేరి వెళ్లింది.
Falaknuma Express
Falaknuma Express train
Secunderabad
Ghatkesar
Train check
Terrorist threat
Railway police
Telangana police
Train security

More Telugu News