Salman Agha: ఫైనల్లో భారత్‌ను ఓడిస్తాం: పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా ధీమా

Salman Agha Confident Pakistan Will Beat India in Final
  • బంగ్లాదేశ్‌పై 11 పరుగుల తేడాతో పాకిస్థాన్ విజయం
  • ఆసియా కప్ ఫైనల్లో భారత్‌తో అమీతుమీకి సిద్ధం
  • భారత్‌ను ఓడించే సత్తా తమకుందన్న పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా
  • తమది చాలా ప్రత్యేకమైన జట్టు అని వ్యాఖ్య
ఆసియా కప్ సూపర్-4లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో విజయం సాధించిన పాకిస్థాన్, ఫైనల్ ప్రత్యర్థి అయిన భారత్‌కు గట్టి హెచ్చరికలు పంపింది. ఆదివారం జరగనున్న తుదిపోరులో టీమిండియా సహా ఏ జట్టునైనా ఓడించే సత్తా తమకుందని పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా ధీమా వ్యక్తం చేశాడు. ఇలాంటి క్లిష్టమైన మ్యాచ్‌లలో గెలవడం తమ జట్టు ప్రత్యేకతను చాటుతోందని ఆయన అన్నారు.

నిన్న‌ జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. తొలుత బ్యాటింగ్‌లో తడబడిన పాక్, నిర్దేశించిన 135 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. బంగ్లాదేశ్‌ను 11 పరుగుల తేడాతో ఓడించి ఆసియా కప్‌లో తొలిసారి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ టోర్నీలో ఇప్పటికే రెండుసార్లు తలపడిన చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మూడోసారి టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి.

విజయం అనంతరం సల్మాన్ ఆఘా మాట్లాడుతూ, "ఇలాంటి మ్యాచ్‌లు గెలిచినప్పుడు మాదొక ప్రత్యేకమైన జట్టు అనిపిస్తుంది. మేం ఏం చేయాలో మాకు స్పష్టంగా తెలుసు. ఆదివారం మైదానంలోకి అడుగుపెట్టి భారత్‌ను ఓడించడానికి ప్రయత్నిస్తాం" అని పేర్కొన్నాడు. అయితే బ్యాటింగ్‌లో ఇంకా కొన్ని మార్పులు అవసరమని, దానిపై దృష్టి సారిస్తామని తెలిపాడు.

ఇక‌, ఈ మ్యాచ్‌లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలుచుకున్న షాహీన్ షా అఫ్రిదిపై కెప్టెన్ ప్రశంసలు కురిపించాడు. "షాహీన్ ఒక ప్రత్యేకమైన ఆటగాడు. జట్టుకు అవసరమైనది చేసి చూపిస్తాడు. మేం నిర్దేశించిన స్కోరు 15 పరుగులు తక్కువే అయినప్పటికీ, మా బౌలర్లు అద్భుతంగా రాణించి మ్యాచ్ గెలిపించారు" అని చెప్పుకొచ్చాడు.

బ్యాటింగ్‌లో కేవలం 13 బంతుల్లో 19 పరుగులు చేసి జట్టు స్కోరు పెరగడంలో కీలకపాత్ర పోషించిన షాహీన్ అఫ్రిది, ఆ తర్వాత బౌలింగ్‌లోనూ 17 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. తన బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ, "తొలి వికెట్లు త్వరగా పడినప్పుడు బౌలర్లపై ఎదురుదాడి చేయాలని టీమ్ నిర్ణయించింది. నేను కొట్టిన సిక్సులు మ్యాచ్ గతిని మా వైపు తిప్పాయి" అని చెప్పాడు. ఫైనల్ గురించి అడగ్గా, "మేం సిద్ధంగా ఉన్నాం" అని ఒక్క మాటలో బదులిచ్చాడు.
Salman Agha
Pakistan
India
Asia Cup 2025
Cricket
Shaheen Afridi
Bangladesh
Pakistan vs India
Cricket Final
Asia Cup Final

More Telugu News