Ketavat Shankar Naik: బెల్టు షాపు గొడవకు యూరియా రంగు.. కేటీఆర్‌పై కాంగ్రెస్ నేత ఫైర్

Congress Leader Ketavat Shankar Naik Slams KTRs Comments
  • కేటీఆర్ కు మతిస్థిమితం లేదన్న శంకర్ నాయక్
  • ఎర్రగడ్డ ఆసుపత్రికి పంపాలని వ్యాఖ్య
  • అవినీతిపరులైన బీఆర్ఎస్ నేతలకు జైల్లో ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని హెచ్చరిక
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్‌కు మతి భ్రమించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, ఆయనను ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలించాల్సిన సమయం దగ్గర పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మిర్యాలగూడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

స్థానికంగా ఒక బెల్టు షాపు వద్ద ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వ్యక్తిగత ఘర్షణను బీఆర్ఎస్ పార్టీ యూరియా కొరత వల్ల జరిగిన గొడవగా వక్రీకరిస్తోందని శంకర్ నాయక్ ఆరోపించారు. కనీస వాస్తవాలు తెలుసుకోకుండా కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతున్నారని, వారికి చికిత్స అవసరమని ఎద్దేవా చేశారు. జరిగిన ఘర్షణపై పోలీసులు చట్టప్రకారమే చర్యలు తీసుకున్నారని, ఇందులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన బీఆర్ఎస్ నాయకుల కోసం జైల్లోనే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని శంకర్ నాయక్ హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకే బీఆర్ఎస్, బీజేపీలు స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. అన్నదమ్ముల్లా కలిసి ఉన్న గిరిజనుల మధ్య విభేదాలు సృష్టించేందుకు బీఆర్ఎస్ కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు.

ఈ సమావేశంలో డెలిగేట్ మెంబర్ చిరుమర్రి కృష్ణయ్య, కాంగ్రెస్ నాయకులు స్కైలాబ్ నాయక్, గాయం ఉపేందర్ రెడ్డి, పొదిల్ల శ్రీనివాస్, పగిడి రామలింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 
Ketavat Shankar Naik
KTR
BRS
Congress
Telangana politics
Miryalaguda
Bathula Laxma Reddy
Jagadish Reddy
local elections
urea shortage

More Telugu News