Ayyanna Patrudu: ఏపీ అసెంబ్లీలో కొత్త భవనం ప్రారంభం.. త్వరలోనే ప్రధాన భవన నిర్మాణం

AP Assembly New Building Inaugurated by Ayyanna Patrudu
  • స్పీకర్ అయ్యన్న, మంత్రులు నారాయణ, కేశవ్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం
  • రూ.3.55 కోట్ల వ్యయంతో పూర్తి చేసిన నిర్మాణం
  • కొత్త అసెంబ్లీ డిజైన్లు సిద్ధమయ్యాయన్న మంత్రి నారాయణ
రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు తిరిగి ఊపందుకుంటున్నాయి. ఇందులో భాగంగా, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రాంగణంలో రూ.3.55 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన భవనాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రులు పొంగూరు నారాయణ, పయ్యావుల కేశవ్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా, రాష్ట్రానికి శాశ్వత, పూర్తిస్థాయి అసెంబ్లీ భవన నిర్మాణాన్ని కూడా త్వరలోనే ప్రారంభిస్తామని నేతలు ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, "ఈ నూతన భవనాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. దీని మొదటి అంతస్తును విప్‌లకు కేటాయించాం. త్వరలోనే ఇక్కడ మీడియా పాయింట్‌ను కూడా ఏర్పాటు చేస్తాం. ఈ భవన నిర్మాణ పనులు వేగంగా పూర్తి కావడానికి మంత్రి నారాయణ ఎంతో కృషి చేశారు" అని ప్రశంసించారు.

అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ, ఈ భవనాన్ని మొదట రూ.5 కోట్ల అంచనాలతో ప్రారంభించినప్పటికీ, కేవలం రూ.3.50 కోట్లతోనే పూర్తి చేశామని వెల్లడించారు. గత కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే నిర్మాణం ఆలస్యమైందని ఆయన తెలిపారు. "త్వరలో కొత్త అసెంబ్లీ ప్రధాన భవనం నిర్మాణం చేపడతాం. దానికి సంబంధించిన డిజైన్లు ఇప్పటికే పూర్తయ్యాయి. త్వరలోనే వాటిని ప్రజల ముందు ఉంచుతాం" అని నారాయణ స్పష్టం చేశారు.

ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, శాసనసభ అవసరాలకు అనుగుణంగా చేపట్టే నిర్మాణాలకు నిధుల కొరత లేదని పేర్కొన్నారు. 
Ayyanna Patrudu
Andhra Pradesh Assembly
AP Assembly building
Amaravati
Ponguru Narayana
Payyavula Keshav
GV Anjaneyulu
Andhra Pradesh politics

More Telugu News