Team India: ఆసియా కప్‌లో భారత్ చెత్త‌ ఫీల్డింగ్.. ఎన్ని క్యాచ్‌లు వదిలేశారో తెలుసా?

Indias sloppy fielding worries fans in Asia Cup 2025
  • ఆసియా కప్ 2025 ఫైనల్‌కు అప్రతిహతంగా దూసుకెళ్లిన భారత్
  • అయితే ఫీల్డింగ్‌లో మాత్రం తీవ్రంగా నిరాశపరుస్తున్న ఆటగాళ్లు
  • ఈ టోర్నీలో అత్యధికంగా 12 క్యాచ్‌లు జారవిడిచిన జట్టుగా భారత్
  • చివరి రెండు మ్యాచ్‌లలోనే 9 క్యాచ్‌లను నేలపాలు చేసిన ఫీల్డర్లు
  • దుబాయ్ స్టేడియం లైటింగ్ కూడా ఓ కారణమన్న స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి
ఆసియా కప్ 2025లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతోంది. బంగ్లాదేశ్‌పై సూపర్ 4లో విజయం సాధించి, టోర్నీలో ఇప్పటివరకు ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్‌కు చేరింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొడుతున్నా, జట్టును ఒక పెద్ద బలహీనత తీవ్రంగా కలవరపెడుతోంది. అదే పేలవమైన ఫీల్డింగ్. ముఖ్యంగా కీలక సమయాల్లో క్యాచ్‌లను జారవిడవడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.

ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌లలో భారత ఫీల్డర్లు ఏకంగా 12 క్యాచ్‌లను నేలపాలు చేశారు. ఈ గణాంకాలతో టోర్నీలో అత్యధిక క్యాచ్‌లు వదిలేసిన జట్టుగా టీమిండియా చెత్త రికార్డును మూటగట్టుకుంది. ముఖ్యంగా చివరి రెండు మ్యాచ్‌లలోనే 9 క్యాచ్‌లను వదిలేయడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 క్యాచ్‌లు వదిలేశారు. 

ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే కథ పునరావృతమైంది. ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు 5 క్యాచ్‌లు జారవిడవగా, అందులో 4 ఒకే బ్యాటర్ సైఫ్ హసన్‌వి కావడం గమనార్హం. అతను ఈ అవకాశాల‌ను సద్వినియోగం చేసుకుని అద్భుత‌మైన హాప్ సెంచ‌రీతో చెల‌రేగాడు. ఈ రెండు మ్యాచ్‌లలో భారత్ గెలిచినప్పటికీ, ఫైనల్ లాంటి కీలక పోరులో ఇలాంటి తప్పిదాలు చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని క్రీడా విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ఈ వరుస వైఫల్యాలపై మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని టీమిండియా ఫీల్డింగ్ త‌ప్పిదాల విష‌య‌మై ప్రశ్నించగా, అతను ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. "ఈ స్థాయిలో సాకులు చెప్పకూడదు, కచ్చితంగా మేము క్యాచ్‌లు అందుకోవాలి. ఫైనల్‌కు వెళ్లే జట్టుగా ఇలాంటి పొరపాట్లు చేయకూడదు. అయితే, దుబాయ్ స్టేడియంలోని 'రింగ్ ఆఫ్ ఫైర్' లైటింగ్ కొన్నిసార్లు కంటికి అడ్డుపడుతోంది. దానివల్ల కొంచెం ఇబ్బంది కలుగుతోంది. దానికి మేం అలవాటు పడాలి" అని వరుణ్ వివరించాడు. కారణం ఏదైనా, ఫైనల్ పోరుకు ముందు ఈ సమస్యను అధిగమించాల్సిన అవసరం టీమిండియాకు ఎంతైనా ఉంది.
Team India
Asia Cup 2025
India cricket team
fielding
Varun Chakravarthy
dropped catches
cricket
Bangladesh
Pakistan
Saif Hassan
Dubai stadium

More Telugu News