Dallas Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ఇమ్మిగ్రేషన్ కేంద్రంపై ఫైరింగ్

Shooting at Dallas Immigration Center Leaves Two Dead
  • డాలస్‌లోని అమెరికా ఇమ్మిగ్రేషన్ కార్యాలయంపై కాల్పులు
  • పక్కనే ఉన్న భవనం నుంచి కాల్పులు జరిపిన దుండగుడు
  • ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి, ఇద్దరికి గాయాలు
  • గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు
  • కాల్పులకు తెగబడిన నిందితుడు కూడా మృతి
అమెరికాలోని డాలస్‌లో మరోసారి కాల్పుల మోత కలకలం రేపింది. బుధవారం ఉదయం ఓ ప్రభుత్వ భవనాన్ని లక్ష్యంగా చేసుకుని ఓ ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో నిందితుడితో సహా ఇద్దరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

డాలస్ పోలీసుల కథనం ప్రకారం, బుధవారం ఉదయం సుమారు 6:40 గంటల సమయంలో నార్త్ స్టెమన్స్ ఫ్రీవేలోని 8100 బ్లాక్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్‌ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) విభాగానికి చెందిన డిటెన్షన్ కేంద్రం పక్కనే ఉన్న భవనం నుంచి ఓ దుండగుడు కాల్పులు ప్రారంభించాడు. ఈ దాడిలో కార్యాలయంలో ఉన్న ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాల్పుల్లో గాయపడిన మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపిన నిందితుడు కూడా మరణించినట్లు పోలీసులు తమ అధికారిక ఎక్స్ (ట్విట్ట‌ర్‌) ఖాతా ద్వారా ధ్రువీకరించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ప్రాథమిక విచారణ కొనసాగుతోందని డాలస్ పోలీస్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, పూర్తి వివరాలను త్వరలోనే మీడియా సమావేశంలో వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళన వాతావరణం నెలకొంది.
Dallas Shooting
Dallas
Immigration Center
ICE
US Immigration
North Stemmons Freeway
America
Crime
Gun Violence
Texas

More Telugu News