Ramachander Rao: నేతలు, కార్యకర్తలు హైదరాబాద్‌ను వదిలి వెళ్లాలి!: రామచందర్ రావు

Ramachander Rao Calls for BJP Leaders to Promote Modis Welfare Programs
  • ఇంటింటికీ మోదీ తీసుకొచ్చిన కార్యక్రమాలను తెలియజేయాలని పిలుపు
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి పట్టంకట్టేలా కార్యకర్తలు పని చేయాలని సూచన
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధిస్తామని ధీమా
  • జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న రామచందర్ రావు
నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్‌ను వీడి, ప్రతి ఇంటికి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పిలుపునిచ్చారు. రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టం కట్టేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ప్రతి గ్రామానికి వెళ్లి ప్రచారం చేయాలని ఆయన సూచించారు.

స్థానిక ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాలు గెలుస్తుందనే నమ్మకం తనకు ఉందని ఆయన అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించబోతోందని ఆయన జోస్యం చెప్పారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పడటం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. కార్యకర్తగా 40 ఏళ్లుగా బీజేపీలో కొనసాగినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

బీజేపీ కృషి వల్లే తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిందని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ మాటలతో పదేళ్లుగా తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే పరిస్థితిలో లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అధికారంలో ఉండి విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశాయని ఆరోపించారు. కేవలం 600 గ్రూప్-1 పోస్టులను కూడా భర్తీ చేయలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు.

42 శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం జీవో ఇచ్చి స్థానిక ఎన్నికలకు వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. జీఎస్టీ తగ్గింపును దేశ ప్రజలు స్వాగతిస్తున్నారని, దీనివల్ల అన్ని సామాజిక వర్గాల ప్రజలు లబ్ధి పొందుతారని రామచందర్ రావు అన్నారు. జీఎస్టీ తగ్గింపు నిర్ణయాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. ఖరీఫ్ సీజన్ ముగిసేలోపు రైతులకు పూర్తిస్థాయిలో యూరియా అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు. యూరియా బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు.
Ramachander Rao
Telangana BJP
BJP
Narendra Modi
Local Body Elections
Telangana Politics

More Telugu News