Suicide: 'నాకు డాక్టర్ అవ్వాలని లేదు'.. ఎంబీబీఎస్‌లో చేరాల్సిన రోజే విద్యార్థి బలవన్మరణం

Anurag Anil Borkar NEET Topper Commits Suicide on MBBS Joining Day
  • మహారాష్ట్ర చంద్రపూర్‌ జిల్లాలో ఘ‌ట‌న‌
  • అడ్మిషన్ కోసం కాలేజీకి వెళ్లాల్సిన రోజే విద్యార్థి ఆత్మహత్య
  • నాకు డాక్టర్ కావడం ఇష్టం లేదంటూ సూసైడ్ నోట్
  • 99.99 పర్సంటైల్ సాధించిన అనురాగ్ అనిల్ బోర్కర్
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మహారాష్ట్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నీట్ లో అత్యుత్తమ ర్యాంకు సాధించిన ఓ విద్యార్థి, వైద్య విద్యలో చేరడానికి వెళ్లాల్సిన రోజే ఆత్మహత్య చేసుకున్నాడు. డాక్టర్ కావడం తనకు ఇష్టం లేదని సూసైడ్ నోట్‌లో పేర్కొనడం అందరినీ కలిచివేస్తోంది.

వివరాల్లోకి వెళితే... చంద్రపూర్ జిల్లా సిందేవాహి తాలూకాలోని నవర్‌గావ్ గ్రామానికి చెందిన అనురాగ్ అనిల్ బోర్కర్ (19) ఇటీవల వెలువడిన నీట్ యూజీ 2025 ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచాడు. ఓబీసీ కేటగిరీలో 99.99 పర్సంటైల్ సాధించి, ఆల్ ఇండియా స్థాయిలో 1,475వ ర్యాంకు సాధించాడు.

ఈ ర్యాంకుతో ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఉన్న ఓ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కోర్సులో అడ్మిషన్ ఖరారైంది. ఇందుకోసం కుటుంబ సభ్యులు అతడిని పంపేందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఈ ఘోరం జరిగింది. గోరఖ్‌పూర్‌కు బయలుదేరడానికి ముందే అనురాగ్ తన ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ఒక సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో, "నాకు డాక్టర్ కావాలని లేదు" అని అనురాగ్ రాసినట్లు పోలీసులు వెల్ల‌డించారు. ఈ ఘటనపై నవర్‌గావ్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. అత్యుత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థి వైద్య వృత్తిపై ఆసక్తి లేక ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిచివేస్తోంది.
Suicide
Anurag Anil Borkar
NEET UG 2025
MBBS Admission
Chandrapur
Maharashtra
Gorakhpur Medical College
Student Suicide
NEET Rank
Medical Education

More Telugu News