Donald Trump: హెచ్-1బీపై ట్రంప్ 'లక్ష' బాంబు.. నెలకి 5,500 ఉద్యోగాలకు గండం!

H1B fee hike by Trump may impact 5500 jobs monthly
  • హెచ్-1బీ దరఖాస్తు ఫీజు లక్ష డాలర్లకు పెంచిన ట్రంప్ సర్కార్
  • భారతీయ టెక్కీలు, టెక్ కంపెనీలపై తీవ్ర ప్రభావం
  • నెలకి 5,500 వరకు వర్క్ పర్మిట్లు తగ్గే అవకాశం
  • ఇది హెచ్-1బీ వ్యవస్థను నాశనం చేయడమేనన్న నిపుణులు
  • ట్రంప్ నిర్ణయంపై కాలిఫోర్నియా అటార్నీ జనరల్ సమీక్ష
  • కొత్త ఫీజుపై చట్టపరమైన చర్యలు తీసుకునే యోచన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వలస వ్యతిరేక విధానాలకు మరింత పదును పెడుతున్నారు. విదేశీ నైపుణ్యానికి పెద్దపీట వేసే హెచ్-1బీ వీసా వ్యవస్థపై ఆయన మరోసారి ఉక్కుపాదం మోపారు. హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుమును ఏకంగా లక్ష డాలర్లకు (సుమారు రూ. 83 లక్షలు) పెంచాలన్న ఆయన తాజా ప్రతిపాదన, ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారత ఐటీ రంగంలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే  వేలాది మంది భారతీయ నిపుణుల అమెరికా కల కల్లలయ్యే ప్రమాదం ఉంది.

ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక సేవల సంస్థ జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కో ఈ ప్రతిపాదన వల్ల కలగబోయే నష్టాలపై ఒక నివేదిక విడుదల చేసింది. ఆ సంస్థ ఆర్థికవేత్తలు అబియల్ రీన్‌హార్ట్, మైఖేల్ ఫెరోలీ ప్రకారం ఈ విధానం అమలైతే ప్రతి నెలా సగటున 5,500 మంది విదేశీ నిపుణులు అమెరికాలో ఉద్యోగ అనుమతులు పొందే అవకాశాన్ని కోల్పోతారు. అమెరికా మొత్తం కార్మిక శక్తితో పోలిస్తే ఇది చిన్న సంఖ్యే అయినా దీని ప్రభావం ప్రధానంగా టెక్నాలజీ కంపెనీలు, వాటిలో అత్యధికంగా పనిచేస్తున్న భారతీయ టెక్కీలపైనే పడుతుందని ఆ నివేదిక స్పష్టం చేసింది. 2024 ఆర్థిక సంవత్సరంలో జారీ అయిన మొత్తం హెచ్-1బీ వీసాల్లో 71 శాతం భారతీయులే దక్కించుకున్నారన్న గణాంకాలు ఈ ఆందోళనలకు బలం చేకూరుస్తున్నాయి.

ఈ ప్రతిపాదనపై ఆర్థికవేత్తలు, నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెవెలియో ల్యాబ్స్ సీనియర్ ఆర్థికవేత్త లౌజైనా అబ్దెల్వాహెద్ దీనిని  ‘హెచ్-1బీ వ్యవస్థను సమూలంగా ధ్వంసం చేసే చర్య’గా అభివర్ణించారు. "ఈ ఫీజు పెంపు వల్ల చిన్న, మధ్య తరహా కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవడానికి వెనుకాడుతాయి. ఫలితంగా ఏటా 1,40,000 కొత్త ఉద్యోగాల సృష్టి ప్రమాదంలో పడుతుంది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టం" అని ఆమె హెచ్చరించారు. ఇప్పటికే వలసలు తగ్గడంతో అమెరికా కార్మిక మార్కెట్ మందగించిందని ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో ట్రంప్ ప్రతిపాదన మరింత చర్చనీయాంశంగా మారింది.

న్యాయపోరాటానికి కాలిఫోర్నియా సన్నద్ధం
ట్రంప్ ప్రతిపాదనపై చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. టెక్ పరిశ్రమకు కేంద్రమైన కాలిఫోర్నియా రాష్ట్ర అటార్నీ జనరల్ రాబ్ బొంటా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. "ఈ విధానంపై మేము చట్టపరమైన సమీక్ష జరుపుతున్నాం. మా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నైపుణ్యం కలిగిన ఉద్యోగులపైనే ఆధారపడి ఉంది. ఈ ఫీజు అనిశ్చితిని సృష్టించి, మా కంపెనీల భవిష్యత్తును దెబ్బతీస్తుంది" అని ఆయన అన్నారు. ప్రభుత్వ విధానాలు హేతుబద్ధంగా, పారదర్శకంగా ఉండాలి తప్ప ఏకపక్షంగా ఉండకూడదని, ఈ ఫీజు పెంపు 'అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ యాక్ట్'ను ఉల్లంఘిస్తుందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. మొత్తం మీద, ట్రంప్ ప్రతిపాదన అమెరికాలోని టెక్ పరిశ్రమలో పెను తుపాను రేపుతుండగా, లక్షలాది మంది భారతీయ నిపుణుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది.
Donald Trump
H1B visa
US immigration
Indian IT professionals
visa fees increase
US jobs
California
foreign workers
tech industry
labor market

More Telugu News