Rajasthan: కిరాతకం.. నోట్లో రాయి పెట్టి, మూతికి జిగురు అతికించి అడవిలో పసికందు

Rajasthan infant girl found alive after cruel abandonment
  • రాజస్థాన్‌లో వెలుగు చూసిన అమానవీయ ఘటన
  • 15 రోజుల పసిపాపను అడవిలో వదిలేసిన దుండగులు
  • నోట్లో రాయి, మూతికి జిగురు పెట్టి అత్యంత కిరాతకం
  • చిన్నారిని గుర్తించి కాపాడిన పశువుల కాపరి
  • ఆసుప‌త్రిలో చికిత్స, నిలకడగా పాప ఆరోగ్యం
  • తల్లిదండ్రుల కోసం గాలిస్తున్న పోలీసులు
రాజస్థాన్‌లో సభ్య సమాజం తలదించుకునే అమానవీయ ఘటన వెలుగుచూసింది. 15 రోజుల పసికందు నోట్లో రాయి పెట్టి, మూతికి జిగురు అతికించి అడవిలో పడేసి ప్రాణాలు తీయాలని చూశారు. అయితే, ఓ పశువుల కాపరి ఆ చిన్నారిని గుర్తించి ప్రాణాలు కాపాడాడు. పాప తల్లిదండ్రులే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని భావిస్తున్నారు. 

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లా అటవీ ప్రాంతంలో పశువులను మేపుతున్న ఓ కాపరికి పొదల మధ్య నుంచి ఓ చిన్నారి ఏడుపు వినిపించింది. దగ్గరికి వెళ్లి చూడగా, రాళ్ల మధ్య కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పసిపాప కనిపించింది. ఆ చిన్నారి అరవకుండా నోటికి జిగురు అంటించి ఉండటాన్ని ఆయన గమనించాడు. వెంటనే ఆ జిగురును తొలగించగా, నోట్లో రాయి ఉండటాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు.

ఊపిరాడకుండా చేసి చంపేయాలనే దురుద్దేశంతోనే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని భావించిన ఆయన, వెంటనే ఆ రాయిని బయటకు తీశాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పసికందును ఎత్తుకుని సమీపంలోని ప్రభుత్వ ఆసుప‌త్రికి తీసుకెళ్లాడు. వైద్యులు వెంటనే చికిత్స అందించడంతో చిన్నారి ప్రాణాపాయం నుంచి బయటపడింది. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాప తల్లిదండ్రుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక ఆసుప‌త్రుల్లో గత 15 రోజుల్లో జరిగిన ప్రసవాల వివరాలను సేకరించి విచారణ జరుపుతున్నారు.
Rajasthan
Infant girl
Newborn baby
Crime
Bhilwara district
Child abandonment
Infanticide attempt
Police investigation

More Telugu News