Istekhar Ahmed: భార్య మరొకరితో వెళ్లిపోయిందని మరదలిని హత్య చేసిన బావ.. ఢిల్లీలో ఘోరం

Delhi Man Kills Sister in Law Blaming Her for Wife Elopement
  • భార్య పుట్టింటి వారిపై కక్ష పెంచుకుని దారుణం
  • మరదలిపై కత్తితో దాడి.. అడ్డొచ్చిన ఆమె కుమార్తెకూ గాయాలు
  • బౌన్సర్ గా పనిచేస్తూ పిల్లలను పోషించుకుంటున్న మృతురాలు
భార్య మరొక వ్యక్తితో వెళ్లిపోవడానికి ఆమె పుట్టింటి వారు సహకరించారని ఆగ్రహించిన భర్త దారుణానికి ఒడిగట్టాడు. మాంసం కోసే కత్తితో భార్య సోదరి ఇంటికి వెళ్లి దాడి చేశాడు. విచక్షణారహితంగా పొడవడంతో మరదలు అక్కడికక్కడే మరణించింది. తల్లిని కాపాడుకోవడానికి ప్రయత్నించిన ఆమె కుమార్తెపై కూడా నిందితుడు కత్తి దూశాడు. ఈ దాడిలో ఆ యువతి వేలు తెగిపోయింది. ఢిల్లీలోని ఖ్యాలా ఏరియా జెజె కాలనీలో మంగళవారం చోటుచేసుకుందీ దారుణం.

బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గజియాబాద్ కు చెందిన ఇస్తెకార్ అహ్మద్ అలియాస్ బబ్బు (49) భార్య ఇటీవల మరో యువకుడితో వెళ్లిపోయింది. ఈ విషయంలో తన భార్యకు ఆమె పుట్టింటి వారు సహకరించారని బబ్బు కోపం పెంచుకున్నాడు. వారిపై పగ తీర్చుకోవాలని మాంసం కొట్టే కత్తి కొనుగోలు చేశాడు. మంగళవారం ఉదయం కత్తితో జెజె కాలనీలో ఉంటున్న తన భార్య సోదరి నుస్రత్ (42) ఇంటికి వెళ్లాడు.

నుస్రత్ భర్త జైలు పాలవడంతో బౌన్సర్ గా పనిచేస్తూ పిల్లలను పోషించుకుంటోంది. ఈ క్రమంలో మరిది ఇంటికి రావడంతో కూర్చోమని చెప్పి టిఫిన్ తీసుకురావడానికి కిచెన్ లోకి వెళ్లింది. వెనకే వెళ్లిన బబ్బు కత్తితో ఆమెపై దాడి చేశాడు. నుస్రత్ కేకలు వేయడంతో ఆమె కూతురు సానియా (20) పరుగెత్తుకుంటూ వచ్చి బబ్బును అడ్డుకుంది. సానియాపైనా కత్తి దూసిన బబ్బు.. ఆమె వేలును కట్ చేశాడు.

ఇంట్లోనే ఉన్న మరో బంధువుపైనా దాడి చేసి గాయపరిచాడు. కత్తిపోట్లతో రక్తపుమడుగులో పడిపోయిన నుస్రత్ అక్కడికక్కడే మరణించింది. ఈ దారుణంపై నుస్రత్ మేనల్లుడు ఉస్మాన్ (19) ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Istekhar Ahmed
Delhi crime
murder
sister in law
crime news
Khayala area
JJ Colony
domestic violence
knife attack

More Telugu News