Transgenders: దసరా మామూలు సరిపోలేదని.. ఆసుప‌త్రిలో నర్సుపై హిజ్రాల దాడి.. వైర‌ల్ వీడియో!

Transgenders Assault Nurse for Dasara Mamulu in Nellore
  • నెల్లూరు జిల్లా కందుకూరులో దారుణం
  • మామూళ్ల కోసం ఆసుప‌త్రిలో నర్సుపై దాడి
  • ఆరుగురు ట్రాన్స్‌జెండర్ల అమానుష ప్రవర్తన
  • మద్యం మత్తులో బూతులు తిడుతూ దాడి
  • నర్సు జుట్టు పట్టి, బట్టలు చించిన హిజ్రాలు
నెల్లూరు జిల్లా కందుకూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. దసరా మామూళ్లు డిమాండ్ చేస్తూ కొందరు ట్రాన్స్‌జెండర్లు ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో పనిచేస్తున్న నర్సుపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. కందుకూరులోని కోవూరు రోడ్డులో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలోకి ఆరుగురు ట్రాన్స్‌జెండర్లు ప్రవేశించారు. అక్కడ విధుల్లో ఉన్న నర్సు వద్దకు వెళ్లి దసరా పండుగకు మామూలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే, ఆమె ఇచ్చిన డబ్బులు సరిపోలేదని ఆగ్రహంతో ఊగిపోయిన వారు, ఒక్కసారిగా ఆమెపై దాడికి దిగారు.

నిందితులు మద్యం మత్తులో ఉన్నారని, అసభ్య పదజాలంతో దూషిస్తూ నర్సు జుట్టు పట్టుకుని లాగి, ఆమె బట్టలు చించివేసి అమానుషంగా ప్రవర్తించారని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. ఈ అరాచకంతో ఆసుప‌త్రిలో భయానక వాతావరణం నెలకొంది.

ఈ ఘటనపై ఆసుప‌త్రి యాజమాన్యం వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో హిజ్రాల ఆగడాలు మితిమీరిపోతున్నాయని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Transgenders
Nellore
Kandukuru
Nurse assault
Extortion
Dasara festival
Private hospital
Crime news
Andhra Pradesh

More Telugu News