Chandrababu Naidu: బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు విందు.. ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలంటూ పిలుపు

Chandrababu Naidu Invites Bankers to Invest in Amaravati Projects
  • రాజధానిలో రీజనల్ ఆఫీసులు పెట్టాలన్న సీఎం చంద్రబాబు
  • విస్తృత అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపు 
  • బ్యాంకుల చైర్మన్లు, ఎండీల సమావేశంలో సీఎం చంద్రబాబు
అమరావతిలో ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించాలని, రాజధానిలో చేపట్టే వివిధ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని పలు బ్యాంకుల ఛైర్మన్‌లు, ఎండీలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. లోక్‌సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ సమావేశంలో భాగంగా విజయవాడ వచ్చిన పలు బ్యాంకుల ఛైర్మన్‌లు, ఎండీలకు నిన్న తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి విందు ఇచ్చారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టుల గురించి వివరించారు. అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా నిర్మిస్తున్నందున విస్తృత అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. ఇప్పటికే వివిధ బ్యాంకులకు రాజధానిలో స్థలాలు కేటాయించిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. 15 నెలల కాలంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, కేంద్ర సహకారంతో చేపట్టిన ప్రాజెక్టుల గురించి వారికి తెలియజేస్తూ, పోర్టులు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, జాతీయ రహదారులు, క్వాంటం వ్యాలీ తదితర పనుల పురోగతిని వివరించారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ప్రణాళికల గురించి చెప్పారు. విద్యుత్, వ్యవసాయం, నీటిపారుదల, విద్య, వైద్య రంగాల్లో, పౌర సేవల్లో సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్నామని అన్నారు. ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, పి. నారాయణ, ఎంపీ బాలశౌరి, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ శ్రీనివాసులు శెట్టి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామ సుబ్రమణ్యన్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఎండీ దేవదత్త చంద్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండీ అశోక్ చంద్ర, ఇండియన్ బ్యాంక్ ఎండీ బినోద్ కుమార్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ రజనీష్ కర్నాటక్, కెనరా బ్యాంక్ ఎండీ సత్యనారాయణ రాజు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సీఎండీ పరమేందర్ చోప్రా, ఐఆర్‌డీఏఐ చైర్ పర్సన్ అజయ్ సేత్, నేషనల్ ఇన్సూరెన్స్ ఛైర్మన్ రాజేశ్వరీ సింగ్ ముని, ఎల్ఐసీ ఎండీ సత్పాల్ భాను, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ సీఎండీ భూపేష్ సుశీల్ రాహుల్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ సీఎండీ సంజయ్ జోషీ, అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా ఈడీ సంజయ్ లాల్లా తదితరులు ఈ విందులో పాల్గొన్నారు. 
Chandrababu Naidu
AP CM
Andhra Pradesh
Amaravati
Bankers meeting
Investment opportunities
Infrastructure projects
State government policies
P Keshav
P Narayana

More Telugu News