Telangana Elections: తెలంగాణలోని ఆ మండలంలోని గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టు స్టే

Telangana Elections Supreme Court Stays Local Elections in Mangapet Mandal
  • ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాల్లో ఎన్నికల నిర్వహణపై స్టే
  • మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు
  • గిరిజన గ్రామాలుగా పేర్కొంటూ హైకోర్టు ప్రకటించడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన గిరిజనేతరులు
తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా మంగపేట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. మండల పరిధిలోని 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికల నిర్వహణపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ గ్రామాలను గిరిజన గ్రామాలుగా పేర్కొంటూ గతంలో హైకోర్టు ప్రకటించగా, ఆయా గ్రామాల గిరిజనేతరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

మంగపేట మండలంలోని 23 గ్రామాలు గిరిజన పరిధిలో లేవని 1950లో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనిపై 2013లో గిరిజన సంఘాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, నిజాం ఆర్డర్ ఆధారంగా గిరిజన గ్రామాలుగా పరిగణించాలని తీర్పు ఇచ్చింది. రాష్ట్రపతి ఉత్తర్వులను పక్కనపెట్టి నిజాం ఇచ్చిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకోవడంపై స్థానికులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

తమ గ్రామాలను గిరిజన గ్రామాలుగా పరిగణించవద్దని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. 1950లో రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వుల్లో మంగపేట మండలంలో 23 గ్రామాలు లేవని గిరిజనేతరుల తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో స్టే ఇవ్వాలని కోరారు. దీంతో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. మంగపేట మండల పరిధిలోని 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికల పైనా స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana Elections
Mulugu District
Mangapet Mandal
Supreme Court Stay
Local Body Elections

More Telugu News