Nara Lokesh: సంచలన పరిణామం... మంత్రి నారా లోకేశ్ ప్రవేశపెట్టిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన వైసీపీ

AP Assembly Nara Lokesh Resolution Gets Unexpected YCP Backing
  • విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు
  • శాసనమండలిలో తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి నారా లోకేశ్ 
  • ప్రభుత్వ తీర్మానానికి మద్దతు ఇస్తామని బొత్స వెల్లడి
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు మంగళవారం అత్యంత వాడివేడిగా, నాటకీయ పరిణామాల మధ్య సాగాయి. రాష్ట్రానికి గుండెకాయ వంటి విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ అంశం అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రవేశపెట్టిన ఓ కీలక తీర్మానం సభలో సంచలనం సృష్టించగా, ప్రతిపక్ష వైసీపీని ఇరకాటంలో పడేసింది. అనూహ్యంగా, ఆ తీర్మానానికి వైసీపీ మద్దతు తెలపడం చర్చనీయాంశంగా మారింది.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను విజయవంతంగా అడ్డుకున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామికి అభినందనలు తెలుపుతూ, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు సమర్పిస్తూ మంత్రి నారా లోకేశ్ మండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించి, రాష్ట్ర ప్రయోజనాల పట్ల ఐక్యతను చాటాలని ఆయన కోరారు.

అయితే, ఈ సమయంలో జోక్యం చేసుకున్న వైసీపీ సభ్యులు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా కేంద్రం ఇంకా అడుగులు వేస్తోందంటూ తీర్మానాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనిపై మంత్రి లోకేశ్ తీవ్రంగా స్పందించారు. "విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని మేం వందసార్లు చెప్పాం. అయినా మీకు స్పష్టత లేదా? ప్రైవేటీకరణ ఆగిపోయిందని మీరే చెబుతూ, మళ్లీ మీరే సభను తప్పుదోవ పట్టిస్తారా?" అని నిలదీశారు.

గత ఐదేళ్ల వైసీపీ పాలన వైఫల్యాలను ఎత్తిచూపుతూ లోకేశ్ విమర్శలు గుప్పించారు. "మా ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని దాదాపు 80 శాతానికి తీసుకువచ్చాం. మీ హయాంలో అది 48 శాతానికి పడిపోయింది. రూ.25 వేల కోట్ల అప్పులు మిగిల్చారు. అలాంటి మీరు మాట్లాడతారా? మేం సొంత కేసుల కోసం ఢిల్లీ వెళ్లడం లేదు. దేశ ప్రయోజనాల కోసమే ఎన్డీయేకు బేషరతుగా మద్దతు ఇస్తున్నాం. కేంద్రంతో గొడవలు పెట్టుకోం, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరిస్తాం" అని లోకేశ్ స్పష్టం చేశారు. తాను ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదిస్తున్నారా, లేదా వ్యతిరేకిస్తున్నారా? అని వైసీపీని సూటిగా ప్రశ్నించారు.

దిగివచ్చిన వైసీపీ.. బొత్స మద్దతు

మంత్రి లోకేష్ ప్రశ్నతో ఇరకాటంలో పడిన వైసీపీ, చివరకు ప్రభుత్వ తీర్మానానికి మద్దతు ప్రకటించింది. మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. "స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఎవరు ప్రయత్నించినా మా సంపూర్ణ సహకారం, మద్దతు ఉంటాయి" అని తెలిపారు. అయితే, మరోవైపు వైసీపీ సొంతంగా ఓ తీర్మానాన్ని సభ ముందుకు తీసుకురాగా, దానిని అధికార పక్షం అసందర్భంగా అభివర్ణించింది. "మేం ఇప్పటికే స్టీల్ ప్లాంట్‌ను పునరుద్ధరించే పనిలో ఉన్నాం. ఆరు నెలల కిందట రాసుకున్న డ్రాఫ్ట్‌ను ఇప్పుడు తీసుకువచ్చి ప్రయోజనం ఏంటి?" అని లోకేశ్ ఎద్దేవా చేశారు.

రాజీనామా చేస్తా.. నిరూపిస్తారా? బొత్సకు లోకేశ్ సవాల్

సభలో పరిశ్రమలకు భూ కేటాయింపుల అంశం కూడా తీవ్ర దుమారం రేపింది. కూటమి ప్రభుత్వం విలువైన భూములను పరిశ్రమలకు కారుచౌకగా కట్టబెడుతోందని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఈ ఆరోపణలను మంత్రి లోకేశ్ అంతే దీటుగా తిప్పికొట్టారు. "విశాఖలో ఉర్సా కంపెనీకి రూపాయికే ఎకరం భూమి ఇచ్చామని మీరు నిరూపిస్తే, నేను ఈ క్షణమే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా... నిరూపించగలరా?" అని బొత్సకు బహిరంగ సవాల్ విసిరారు.

"రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు, వేలాది ఉద్యోగాలు తెచ్చే టీసీఎస్, కాగ్నిజెంట్ కంపెనీలకు మాత్రమే రూపాయికి భూములు ఇచ్చాం. ఒక్కో కంపెనీ 25 వేల ఉద్యోగాలు సృష్టిస్తుంది. రాష్ట్రంలో రూ.15 వేల కోట్ల ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. వారికి భూములు ఇవ్వడం తప్పా ఒప్పా మీరే చెప్పాలి" అని బొత్సను నిలదీశారు. తాము అధికారంలోకి వస్తే భూ కేటాయింపులు రద్దు చేస్తామని వైసీపీ నేతలు బెదిరించడంతో టీసీఎస్ వంటి సంస్థలు ఆందోళన చెందుతున్నాయని, దీనిపై బొత్స స్పష్టత ఇవ్వాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
Nara Lokesh
Visakha Steel Plant
Andhra Pradesh
YS Jagan Mohan Reddy
Botsa Satyanarayana
Privatization
Telugu Desam Party
TDP
AP Assembly
Steel Plant

More Telugu News