Chandrababu Naidu: డిప్యూటీ స్పీకర్ రఘురామపై సీఎం చంద్రబాబు సరదా వ్యాఖ్యలు

Chandrababu Naidus Funny Comments on Deputy Speaker Raghurama
  • అసెంబ్లీలో నవ్వులు పూయించిన సీఎం చంద్రబాబు
  • డిప్యూటీ స్పీకర్‌పై సరదా వ్యాఖ్యలతో సందడి వాతావరణం
  • 'అది మీకూ వర్తిస్తుంది అధ్యక్షా' అంటూ సీఎం చలోక్తి
  • ఆహారమే ఔషధమని ప్రజలకు ఆరోగ్య సూత్రాల వెల్లడి
  • ప్రతి ఒక్కరికీ రూ. 2.5 లక్షల ఆరోగ్య బీమా హామీ
  • రాష్ట్రంలో అందరికీ 41 రకాల వైద్య పరీక్షల నిర్వహణ
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మంగళవారం ఓ అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఒక్క సరదా వ్యాఖ్యతో సభ నవ్వులతో నిండిపోయింది. వైద్యారోగ్య శాఖపై జరుగుతున్న చర్చలో ఆయన చేసిన చమత్కారానికి డిప్యూటీ స్పీకర్‌తో సహా సభ్యులందరూ పగలబడి నవ్వారు.

వైద్యారోగ్య శాఖపై చర్చకు సమాధానమిస్తూ సీఎం చంద్రబాబు ప్రజల ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడుతున్నారు. "మనిషి ఆయుర్దాయం 120 ఏళ్లు. కానీ మనం 40 ఏళ్లకే 120 ఏళ్లకు సరిపడా ఆహారాన్ని తినేస్తున్నాం" అని చెబుతూ, ఒక్కసారిగా సభను అధ్యక్ష స్థానం నుంచి నడిపిస్తున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వైపు చూశారు. నవ్వుతూ.. "అధ్యక్షా, ఇది మీకు కూడా వర్తిస్తుంది!" అనడంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. ఈ అనూహ్యమైన వ్యాఖ్యకు డిప్యూటీ స్పీకర్ కూడా నవ్వు ఆపుకోలేకపోయారు.

గతంలో కొందరు పోలీసులు పొట్టలు పెంచుకోవడం చూసి, తగ్గించుకోమని వాళ్లకు స్పష్టం చేశానని చంద్రబాబు వెల్లడించారు. అంతేకాదు, తన వైద్యులు కూడా ఇలాగే కనిపించారని... దాంతో, "డాక్టర్లే పేషెంట్లయితే ఎలా? డాక్టరుగా నువ్వు నాకు ట్రీట్ మెంట్ ఇవ్వడం కాదు, ముందు నీకు నువ్వు ట్రీట్ మెంట్ ఇచ్చుకో." అని చెప్పేవాడ్నని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. 

ఈ సరదా సంభాషణ అనంతరం చంద్రబాబు ఆరోగ్య పరిరక్షణపై కీలక ప్రసంగం చేశారు. "ఆహారమే ఔషధం, మన వంటగదే ఓ ఫార్మసీ" అనే సూత్రాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. అనారోగ్యాలకు అతిగా తినడమే ప్రధాన కారణమని, తాను, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడూ సెలవులు తీసుకోకపోవడానికి క్రమశిక్షణతో కూడిన జీవనశైలే కారణమని తెలిపారు. ప్రజలు తమ జీవనవిధానంలో మార్పులు చేసుకోవాలని, ఉప్పు, పంచదార, నూనె వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలని సూచించారు. రోజుకు 8 గంటల ప్రశాంతమైన నిద్ర అవసరమని నొక్కిచెప్పారు.

రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రతి పౌరుడి ఆరోగ్య సమాచారాన్ని నమోదు చేసి, ఒక్కొక్కరికీ 41 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ రికార్డును సిద్ధం చేస్తామని ప్రకటించారు. దీనితో పాటు రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి రూ. 2.5 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తున్నామని సీఎం వెల్లడించారు. ఆసుపత్రుల్లో చికిత్స ఖర్చుల కంటే గదుల అద్దెలే భారంగా మారాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Chandrababu Naidu
Raghurama Krishnam Raju
Andhra Pradesh Assembly
Health
Diet
Lifestyle
Healthcare
Narendra Modi
Health Insurance

More Telugu News