Shashi Tharoor: హెచ్1బీ వీసా ఫీజు పెంపు.. ట్రంప్, నవారోపై శశిథరూర్ విమర్శలు

Shashi Tharoor slams Trump Navaaro on H1B visa fee hike
  • ట్రంప్ రాజకీయ కారణాలతో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారన్న కాంగ్రెస్ ఎంపీ
  • సుంకాలు, ఫీజు పెంపు అంశాలు అమెరికా సమస్యలు పరిష్కరించగలవని ట్రంప్ భావిస్తున్నారని ఎద్దేవా
  • అధిక ఫీజుల కారణంగా కంపెనీలు ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్‌కు ఇచ్చేస్తాయన్న థరూర్
అమెరికా అధిక సుంకాల తర్వాత హెచ్-1బీ వీసాల ఫీజును పెంచడంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్ తీవ్రంగా స్పందించారు. ట్రంప్ రాజకీయ కారణాలతోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. సుంకాలు, వీసాల ఫీజు పెంపు వంటి అంశాలు అమెరికాలోని సమస్యలను పరిష్కరించగల మాయా సాధనాలు అని ట్రంప్ భావిస్తున్నారని విమర్శించారు.

ట్రంప్ నిర్ణయాలు దేశీయ రాజకీయాలతో ముడిపడి ఉంటాయని అన్నారు. హెచ్-1బీ వీసాల కారణంగా ఎక్కువ వేతనాలు తీసుకునే అమెరికన్ల కంటే తక్కువ వేతనాలు జీతాలు తీసుకునే భారతీయుల వైపే అమెరికా కంపెనీలు మొగ్గు చూపుతున్నాయని శశిథరూర్ అన్నారు. ఫీజును లక్ష డాలర్లకు పెంచితే తమకు కావాల్సిన, ఎక్కువ నైపుణ్యం కలిగిన వారు మాత్రమే అమెరికాకు వస్తారని వారు భావిస్తున్నారని ఎంపీ విమర్శించారు.

అయితే ఈ నిర్ణయం వెనుక ట్రంప్ లాజిక్ ఏమిటో, ఇది నిజంగా సాధ్యమవుతుందా అనేది తనకు అర్థం కావడం లేదని శశిథరూర్ అన్నారు. అధిక ఫీజుల కారణంగా ఎక్కువ కంపెనీలు ఎక్కువ ఉద్యోగాలను అవుట్‌సోర్సింగ్‌కు ఇచ్చేస్తాయని పేర్కొన్నారు.

అమెరికాలోని అనేక సమస్యలకు సుంకాలు పరిష్కారమని, అవి మాయాసాధనంగా ట్రంప్ భావిస్తున్నారని అన్నారు. ఈ టారిఫ్‌ల నుంచి వచ్చే బిలియన్ డాలర్లతో అమెరికాలో నెలకొన్న ద్రవ్యలోటును పూడ్చాలనేది ఆయన ఉద్దేశమై ఉంటుందని ఆయన విమర్శించారు. అయితే, భారత్‌పై సుంకాల విధింపుతో భారత్‌లో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందని అన్నారు. అధిక సుంకాల ద్వారా దిగుమతులు ఖరీదైనవిగా మారి, దేశీయ తయారీ పునరుద్ధరించబడుతుందని, తద్వారా అమెరికన్లకు ఉద్యోగాలు లభిస్తాయని ట్రంప్ భావిస్తున్నట్లుగా ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

భారత్‌పై ట్రంప్ ట్వీట్లు, ఆయన సలహాదారుడు నవారో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని శశిథరూర్ అన్నారు. ట్రంప్ విధించిన టారిఫ్‌లు భారత్‌కు కొంతమేర నష్టం కలిగిస్తాయని, కానీ అధిక సుంకాలు మాత్రం అన్యాయమేనని అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చర్చలు జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా శశిథరూర్ గుర్తు చేశారు.
Shashi Tharoor
H1B Visa
Donald Trump
Tariffs
US India relations
Outsourcing
Trade agreement

More Telugu News