Shoaib Akhtar: భారత ఆటగాళ్లకున్న ధైర్యం మా వాళ్లకు లేదు: పాక్ బోర్డుపై అక్తర్ ఫైర్

Shoaib Akhtar Ready to Fix Pakistan Cricket If Given Chance
  • పాక్ క్రికెట్ ప్రక్షాళనకు సిద్ధమన్న షోయబ్ అక్తర్
  • తనకు మూడేళ్ల సమయం ఇస్తే జట్టును గాడిన పెడతానని వెల్లడి
  • పీసీబీ తనను ఎప్పటికీ సంప్రదించదని సంచలన వ్యాఖ్యలు
  • 20 మంది సభ్యులతో సెలక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తానన్న మాజీ పేస‌ర్‌
  • భారత ఆటగాళ్లలా పాక్ ప్లేయర్లకు స్వేచ్ఛనివ్వాలని సూచన
పాకిస్థాన్ క్రికెట్ జట్టును తిరిగి గాడిలో పెట్టేందుకు తన వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉందని ఆ దేశ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్ 2025లో టీమిండియా చేతిలో రెండుసార్లు ఓటమిపాలైన పాక్ జట్టుపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో అక్తర్ స్పందించాడు. భారత యువ ఆటగాడు అభిషేక్ శర్మకు లభిస్తున్న స్వేచ్ఛ, మద్దతు పాక్ ఆటగాళ్లకు కరవైందని, అందుకే వారు ఒత్తిడిలో విఫలమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఒక క్రీడా కార్యక్రమంలో షోయబ్ మాలిక్ అడిగిన ప్రశ్నకు అక్తర్ బదులిస్తూ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తనకు అవకాశం ఇస్తే జట్టును బాగుచేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. అయితే, తాను సరైన నిర్ణయాలు తీసుకుంటాననే కారణంతో పీసీబీ తనను ఎప్పటికీ సంప్రదించదని ఆయన పరోక్షంగా బోర్డుపై విమర్శలు గుప్పించాడు. "నాకు అధికారం ఇవ్వమని అడగడం లేదు. నేను టీమ్‌వర్క్‌ను, తర్కాన్ని నమ్ముతాను. అందరం కలిసి పనిచేయాలి. నేను 20 మంది సభ్యులతో కూడిన సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేసి, వారి సలహాలు తీసుకుంటాను" అని అక్తర్ వివరించాడు.

ఆటగాళ్లకు భరోసా ఇవ్వడమే తన ప్రథమ కర్తవ్యమని అక్తర్ స్పష్టం చేశాడు. ఈ సంద‌ర్భంగా యువ ఆటగాడు సైమ్ అయూబ్, భారత ఆటగాడు అభిషేక్ శర్మను ఉదాహరణగా చూపుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "నాకు మూడేళ్ల పాటు బాధ్యతలు అప్పగిస్తే, ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపుతా. 'సైమ్.. నువ్వు వెళ్లి స్వేచ్ఛగా ఆడుకో. అభిషేక్ శర్మకు ఆడేందుకు లైసెన్స్ ఉంది, నువ్వు కూడా అలాగే ఆడు. ఔటైనా నిన్ను జట్టు నుంచి తీసేయరు. ఈ ఏడాది మొత్తం నీదే' అని ధైర్యం చెబుతా.... మెరుగైన ప్రదర్శన ఎలా రాదో చూస్తా" అని అక్త‌ర్‌ అన్నాడు.

ప్రస్తుతం సైమ్ అయూబ్ విఫలమవుతాననే భయంతో ఆడుతున్నాడని, అదే అభిషేక్ శర్మ ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడుతున్నాడని అక్తర్ పోల్చాడు. పీఎస్‌ఎల్ వంటి లీగుల్లో పరుగులు చేయడం వేరని, అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడిని జయించి ఆడటమే అసలైన సవాలని అక్తర్ పేర్కొన్నాడు. అయితే, తన పిల్లలు చిన్నవారైనందున ఈ బాధ్యతలను చేపట్టే సమయంపై తనకు కొన్ని పరిమితులు ఉన్నాయని అక్తర్ వెల్లడించాడు.
Shoaib Akhtar
Pakistan Cricket Board
Asia Cup 2025
Pakistan cricket team
Abhishek Sharma
Saim Ayub
cricket selection
team confidence
PSL
cricket coaching

More Telugu News