Telangana: తెలంగాణ‌లో స్థానిక సమరానికి సర్కార్ సై.. నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్?

Telangana Local Body Elections Soon Notification Expected in Days
  • స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ కసరత్తు ముమ్మరం
  • నాలుగైదు రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం
  • బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు నిర్ణయం
  • నేటి సాయంత్రానికి పూర్తికానున్న రిజర్వేషన్ల ప్రక్రియ
  • 2024 కుల సర్వే ఆధారంగా బీసీలకు రిజర్వేషన్ల కేటాయింపు
  • సీల్డ్ కవర్‌లో ప్రభుత్వానికి అందనున్న తుది జాబితా
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించిన సర్కార్, అందుకు సంబంధించిన ప్రక్రియను దాదాపు పూర్తి చేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రిజర్వేషన్ల ఖరారును ముమ్మరం చేసిన అధికారులు, మంగళవారం సాయంత్రానికల్లా తుది జాబితాను ప్రభుత్వానికి సీల్డ్ కవర్‌లో అందించనున్నారు. ఈ జాబితాను పరిశీలించిన వెంటనే, నాలుగైదు రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.

కుల సర్వే ఆధారంగా బీసీ రిజర్వేషన్లు
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ రిజర్వేషన్లను ఖరారు చేస్తున్నారు. ఇందులో భాగంగా షెడ్యూల్డ్ కులాలకు (ఎస్సీ) 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోనుండగా, బీసీలకు మాత్రం ఇటీవల నిర్వహించిన 2024 కుల సర్వే వివరాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. గ్రామాల్లో వార్డు సభ్యులు, సర్పంచ్ మొదలుకొని జడ్పీ ఛైర్‌పర్సన్ వరకు మొత్తం ఆరు స్థాయిల్లో కమిషన్ సిఫార్సులు చేసింది. ఆయా ప్రాంతాల్లోని బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లను కేటాయించనున్నారు.

ప్రత్యేక జీఓతో ఎన్నికలకు సన్నాహాలు
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుపై కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. ఈ నేపథ్యంలో, హైకోర్టు విధించిన సెప్టెంబర్ 30 గడువు సమీపిస్తుండటంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంది. రిజర్వేషన్లపై ప్రత్యేకంగా ఒక ప్రభుత్వ ఉత్తర్వు (జీఓ) జారీ చేసి, ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని భావిస్తోంది. ఈ ప్రక్రియకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున, గడువు పొడిగించాలని హైకోర్టును కోరే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కీలక పరిణామాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే ఒక ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారని సమాచారం.

రాష్ట్రవ్యాప్తంగా 12,760 గ్రామపంచాయతీలు, 1,12,534 వార్డులు, 5,763 ఎంపీటీసీలు, 565 ఎంపీపీలు, 565 జడ్పీటీసీలు, 31 జడ్పీ చైర్‌పర్సన్‌ స్థానాలకు రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ సోమవారం రాత్రి వరకు ముమ్మరంగా సాగింది. వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఎంపీడీవోలు, సర్పంచ్, ఎంపీటీసీల రిజర్వేషన్లను ఆర్డీవోలు, ఎంపీపీ, జడ్పీటీసీలకు జిల్లా కలెక్టర్లు, జడ్పీ చైర్మన్ల రిజర్వేషన్లను పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్లు ఖరారు చేసి ప్రభుత్వానికి నివేదించనున్నారు.
Telangana
Revanth Reddy
Telangana local body elections
BC reservations
Telangana government
Panchayat elections
Ward members
ZPTC
MPTC
Telangana caste survey

More Telugu News