నవరాత్రులకు కేంద్రం కానుక.. మరో 25 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లు
- నవరాత్రుల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
- ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద కొత్త కనెక్షన్లు
- దేశవ్యాప్తంగా 25 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీ
- 10.60 కోట్లకు చేరనున్న మొత్తం ఉజ్వల కుటుంబాలు
- ప్రతి కనెక్షన్‌పై రూ. 2,050 భరించనున్న ప్రభుత్వం
ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ సోమవారం తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా అధికారికంగా వెల్లడించారు. పండుగ సీజన్‌లో పేద కుటుంబాలకు చేయూతనివ్వాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం జారీ చేసే ప్రతి కొత్త ఉచిత కనెక్షన్ కోసం సుమారు రూ. 2,050 ఖర్చు చేయనుందని ఆయన వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి హర్దీప్ సింగ్ పూరీ మాట్లాడుతూ, "ప్రధాని నరేంద్ర మోదీ ఎల్లప్పుడూ మహిళల గౌరవానికి, సాధికారతకు పెద్దపీట వేస్తారు. దుర్గాదేవిని పూజించే ఈ శుభ సమయంలో 25 లక్షల కొత్త ఉజ్వల కనెక్షన్లు ఇవ్వడం మహిళల పట్ల ఆయనకున్న గౌరవానికి మరో నిదర్శనం" అని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.