KTR: హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు: గాజులరామారంలో ఇళ్ల కూల్చివేతలపై కేటీఆర్ ఫైర్

KTR Fires at Congress Over House Demolitions in Gajularamaram
  • సెలవు దినాల్లో కూల్చివేతలపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
  • హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆరోపణ
  • బుల్డోజర్ కేవలం పేదల ఇళ్లపైకే వెళుతోందన్న కేటీఆర్
  • మంత్రులు, పెద్దల నిర్మాణాలను వదిలేశారని విమర్శ
  • కూల్చేసిన కార్యకర్త ఇంటిని తిరిగి కట్టిస్తానని హామీ
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలపై బుల్డోజర్లతో దాడులు చేస్తోందని, ఇది పూర్తిగా హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. సెలవు దినాల్లో ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని ఉన్నత న్యాయస్థానం స్పష్టంగా చెప్పినా, ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

గాజులరామారంలో నిన్న పేదల ఇళ్లను కూల్చివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. "హైకోర్టుకు సెలవు ఉన్న రోజు చూసి మరీ పేదల ఇళ్లను కూల్చివేశారు. ఈ హైడ్రా బుల్డోజర్ కేవలం పేదల ఇళ్లపైకే వెళుతుంది తప్ప, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్న పెద్దల జోలికి వెళ్లదు" అని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి సోదరుడితో పాటు, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్ వెంకటస్వామి వంటి వారు ప్రభుత్వ భూముల్లో, చెరువు శిఖంలలో నిర్మాణాలు చేసినా వాటిని ఎందుకు కూల్చడం లేదని ఆయన ప్రశ్నించారు.

గాజులరామారంలో జరిగిన కూల్చివేతల్లో తమ పార్టీ కార్యకర్త సర్దార్ ఇంటిని కూడా పడగొట్టారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కూల్చివేసిన ఆ ఇంటిని తిరిగి నిర్మించి ఇచ్చే పూర్తి బాధ్యత తాను స్వీకరిస్తున్నానంటూ ఆయన భరోసా ఇచ్చారు. "గాజులరామారంలో ఇళ్లు కూల్చారు, రేపు జూబ్లీహిల్స్‌లోని బోరబండ బస్తీకి కూడా రేవంత్ రెడ్డి హైడ్రాతో వస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడమంటే మన ఇళ్లను కూలగొట్టడానికి లైసెన్స్ ఇచ్చినట్లే" అని ఆయన వ్యాఖ్యానించారు. గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని, ఇక ఆ పార్టీ సినిమా అయిపోయిందని కేటీఆర్ విమర్శించారు. 
KTR
K Taraka Rama Rao
Telangana
Gajularamaram
House Demolitions
High Court
Revanth Reddy
BRS Party
Jubilee Hills
Ponugleti Srinivas Reddy

More Telugu News