Shoaib Akhtar: జట్టులో కెప్టెనే వీక్.. సెలక్షన్ మొత్తం తప్పు: షోయబ్ అక్తర్

Shoaib Akhtar dubs skipper Salman weakest link of Pakistan team after loss to India
  • భారత్ చేతిలో పాక్ ఓటమిపై మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఫైర్
  • కెప్టెన్ సల్మాన్ ఆఘాకు ఏమీ తెలియదంటూ ఘాటు విమర్శలు
  • జట్టులో అత్యంత బలహీనమైన ఆటగాడు కెప్టెనేనని వ్యాఖ్య
  • కోచ్ మైక్ హెస్సన్, మేనేజ్‌మెంట్ ఎంపిక ప్రక్రియను త‌ప్పుబ‌ట్టిన షోయ‌బ్‌
  • బ్యాటింగ్, బౌలింగ్ వ్యూహాలు పూర్తిగా విఫలమయ్యాయని విశ్లేషణ
ఆసియా కప్ 2025లో టీమిండియా చేతిలో పాకిస్థాన్ ఓటమి పాలైన నేపథ్యంలో ఆ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఈ ఓటమికి పూర్తి బాధ్యత కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా, కోచ్ మైక్ హెస్సన్‌లదేనని ఆరోపించాడు. సల్మాన్ ఆఘాకు జట్టులో ఆడే అర్హతే లేదని, అతనే జట్టులో అత్యంత బలహీనమైన ఆటగాడని అక్తర్ ఘాటుగా విమర్శించాడు.

పీటీవీ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ... "కోచ్ మైక్ హెస్సన్ నిర్ణయాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఇక కెప్టెన్ గురించి చెప్పాలంటే, అతనికి అసలు ఏమీ తెలియదు. అతను జట్టులో ఏం చేస్తున్నాడో, ఎందుకు ఆడుతున్నాడో అర్థం కావడం లేదు. జట్టులో అతనే వీక్ లింక్. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు. అదే స్థానంలో భారత్‌కు హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లతో పోల్చిచూడండి. మంచివాడు అయితే సరిపోదు, ప్రతిభతో జట్టుకు ఏం అందిస్తున్నాడన్నదే ముఖ్యం" అని అక్తర్ పేర్కొన్నాడు.

జట్టు ఎంపిక కూడా పూర్తిగా తప్పని అక్తర్ అభిప్రాయపడ్డాడు. "హసన్ నవాజ్ లాంటి మ్యాచ్ విన్నర్‌ను కాదని, అనుభవం లేని ఆటగాళ్లను ఎందుకు తీసుకున్నారు? అసలు జట్టు ఎంపిక వెనుక ఉన్న ఆలోచన ఏంటో నాకు అర్థం కావడం లేదు. బ్యాటింగ్‌లో 10 ఓవర్లలో 91 పరుగులు చేసిన జట్టు, సులభంగా 200 పరుగులు చేయాల్సింది. కానీ, కీలక సమయంలో వికెట్లు పడ్డాక బ్యాటింగ్ నెమ్మదించింది" అని ఆయన విశ్లేషించాడు.

భారత ఓపెనర్ అభిషేక్ శర్మపై పాక్ బౌలర్లు సరైన వ్యూహాన్ని అమలు చేయలేకపోయారని అక్తర్ విమర్శించాడు. "అభిషేక్‌కు పదేపదే షార్ట్ బంతులు వేయాల్సింది. అతడిని ఒత్తిడిలోకి నెట్టడంలో షహీన్ అఫ్రిది విఫలమయ్యాడు. సల్మాన్ ఆఘా కెప్టెన్ తన స్థానాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాడు. తప్పుడు సెలక్షన్ నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఈ ఓటమికి పూర్తి బాధ్యత కెప్టెన్, కోచ్, మేనేజ్‌మెంట్‌దే" అని అక్తర్ స్పష్టం చేశాడు.
Shoaib Akhtar
Salman Ali Agha
Pakistan cricket
Asia Cup 2025
Mike Hesson
India vs Pakistan
cricket team selection
Hasan Nawaz
Shaheen Afridi
Abhishek Sharma

More Telugu News