Reshma: కోడలు పాముకాటుతో విలవిల్లాడుతుంటే.. బయట నవ్వుకున్న అత్తింటివారు!

Kanpur woman attacked with snake over dowry demand
  • కట్నం కోసం కోడలిపై అత్తింటివారి అమానుష దాడి
  • గదిలో బంధించి పామును వదిలిన వైనం
  • పాముకాటుకు గురైన బాధితురాలు రేష్మా
  • నొప్పితో అరుస్తున్నా పట్టించుకోని కుటుంబ సభ్యులు
  • సోదరి చొరవతో ఆసుపత్రికి తరలింపు
  • భర్త సహా ఏడుగురిపై హత్యాయత్నం కేసు నమోదు
కట్నం కోసం కక్కుర్తిపడిన అత్తింటివారు అత్యంత దారుణానికి ఒడిగట్టారు. అదనపు కట్నం ఇవ్వలేదన్న కోపంతో కోడలిని ఒక గదిలో బంధించి, అందులోకి పామును వదిలి చంపేందుకు ప్రయత్నించారు. పాముకాటుకు గురై ఆమె నొప్పితో విలవిల్లాడుతుంటే బయట నిల్చొని నవ్వుతూ పైశాచిక ఆనందం పొందారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగిన ఈ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కాన్పూర్‌లోని కల్నల్‌గంజ్ ప్రాంతానికి చెందిన షానవాజ్‌కు, రేష్మా అనే యువతితో 2021 మార్చి 19న వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది రోజుల నుంచే అత్తింటివారు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. ఇప్పటికే రేష్మా కుటుంబం రూ.1.5 లక్షలు ఇచ్చినా, మరో రూ.5 లక్షలు కావాలంటూ ఒత్తిడి తీవ్రం చేశారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 18న వేధింపులు తారస్థాయికి చేరాయి. రేష్మాను ఒక గదిలో బంధించి, డ్రైనేజీ పైపు ద్వారా లోపలికి ఒక పామును వదిలారు.

ఆ గదిలోనే ఉన్న రేష్మా కాలిని పాము కాటేసింది. నొప్పితో ఆమె గట్టిగా కేకలు వేసినా, అత్తింటివారు తలుపు తీయకపోగా బయట నిల్చొని నవ్వారని బాధితురాలి సోదరి రిజ్వానా ఆరోపించారు. ఎలాగోలా రేష్మా ఫోన్ ద్వారా తన సోదరికి సమాచారం అందించింది. హుటాహుటిన అక్కడికి చేరుకున్న రిజ్వానా, తీవ్ర అస్వస్థతతో ఉన్న రేష్మాను వెంటనే ఆసుపత్రికి తరలించింది. రిజ్వానా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రేష్మా భర్త షానవాజ్‌, అతని తల్లిదండ్రులు, సోదరుడు, సోదరితో పాటు మరో ముగ్గురిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Reshma
Kanpur
Dowry harassment
Snake bite
Uttar Pradesh
Attempted murder
Crime news
Indian Penal Code
Police investigation
Cruelty

More Telugu News