Donald Trump: హెచ్-1బీ ఫీజుల పెంపు ఎఫెక్ట్... కుప్పకూలిన భారత ఐటీ షేర్లు

H1B Visa Fee Hike Impact Indian IT Stocks Crash
  • ఒక్కో వీసాకు రూ. 88 లక్షలు
  • అమాంతం పెరిగిన ఫీజులతో భారత ఐటీ కంపెనీలకు తీవ్ర నష్టం
  • దశాబ్దాల కనిష్ఠానికి ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో షేర్లు
  • ఆందోళన వ్యక్తం చేసిన భారత విదేశాంగ శాఖ
అమెరికాలో ఉద్యోగం చేయాలనే లక్షలాది మంది భారతీయ యువత ఆశలపై ట్రంప్ ప్రభుత్వం పిడుగు వేసింది. "అమెరికన్లకే అగ్ర ప్రాధాన్యం" అనే తన విధానంలో భాగంగా అత్యంత కీలకమైన హెచ్-1బీ వీసా ఫీజును అమాంతం పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా కొన్ని వేల డాలర్లకే పరిమితమైన ఈ ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు (భారత కరెన్సీలో సుమారు రూ. 88 లక్షలు) పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ వార్త వెలువడిన వెంటనే భారత స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ముఖ్యంగా, అమెరికా ప్రాజెక్టులపైనే ఆధారపడిన భారత ఐటీ రంగం భారీ కుదుపునకు లోనైంది.

ట్రంప్ ప్రభుత్వ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే దాని ప్రభావం భారత మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. ఈ ఉదయం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే ఐటీ సూచీ కుప్పకూలింది. దేశంలోని అగ్రగామి కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు 5 నుంచి 8 శాతం వరకు పతనమయ్యాయి. దీంతో ఒక్కరోజే లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. భారత ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను అమెరికాకు పంపించడానికి H-1B వీసాలపైనే అధికంగా ఆధారపడతాయి. ఇప్పుడు ఫీజులు కొండంత పెరగడంతో కంపెనీల నిర్వహణ వ్యయం తడిసి మోపెడవుతుందని, లాభదాయకత గణనీయంగా పడిపోతుందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

మా ఉద్యోగాలు మాకే... విదేశీయులు వద్దు!
ఈ కఠిన నిర్ణయం వెనుక తమ ప్రభుత్వ ఉద్దేశాన్ని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ స్పష్టం చేశారు. "విదేశీ ఉద్యోగులను తీసుకువచ్చి, వారికి శిక్షణ ఇచ్చి, ఆ తర్వాత వారితో అమెరికన్ల ఉద్యోగాలను భర్తీ చేయించే పద్ధతికి చరమగీతం పాడతాం. ఇకపై ఏదైనా కంపెనీకి విదేశీ ఉద్యోగి కావాలంటే ప్రభుత్వానికి లక్ష డాలర్లు చెల్లించాలి, ఆపై ఆ ఉద్యోగికి జీతం ఇవ్వాలి. ఇది ఏమాత్రం ఆర్థికంగా గిట్టుబాటు కాదు. మా దేశంలోని యువతకు అవకాశాలు కల్పించి, వారికే శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లోకి తీసుకోవాలన్నదే మా లక్ష్యం" అని ఆయన తేల్చిచెప్పారు.

భారతీయుల్లో తీవ్ర ఆందోళన
ఈ నిర్ణయంతో ఇప్పటికే అమెరికాలో H-1B వీసాపై పనిచేస్తున్న భారతీయులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తాము దేశం విడిచి వెళితే తిరిగి వచ్చేటప్పుడు ఈ భారీ ఫీజు చెల్లించాలేమోనని ఆందోళన చెందారు. అయితే, ఈ నిబంధన కేవలం కొత్తగా హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని, ప్రస్తుత వీసాదారులకు కాదని యూఎస్ ఇమ్మిగ్రేషన్ విభాగం స్పష్టతనిచ్చింది. అయినప్పటికీ, అమెరికాలో భవిష్యత్తుపై గందరగోళం నెలకొంది. గణాంకాల ప్రకారం, ఏటా జారీ అయ్యే మొత్తం హెచ్-1బీ వీసాలలో 70 శాతానికి పైగా భారతీయులే దక్కించుకుంటుండటం గమనార్హం.

భారత్ ఆందోళన
అమెరికా ఏకపక్ష నిర్ణయంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతాయని, ఇది మానవతా సంక్షోభానికి దారితీయవచ్చని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన ప్రజా సంబంధాలను, భారత నిపుణులు అమెరికా అభివృద్ధికి అందిస్తున్న సేవలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరింది. ఈ పరిణామాలను భారత ప్రభుత్వం, ఐటీ పరిశ్రమ వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి.
Donald Trump
H1B visa
US visa fee hike
Indian IT sector
TCS
Infosys
Wipro
Indian stock market
US immigration policy

More Telugu News