Revanth Reddy: హెచ్‌-1బీ సెగ: ట్రంప్ నిర్ణయంతో తెలుగు టెకీలు విలవిల.. కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్‌

CM Revanth Reddy demands center intervention on H1B visa issue
  • హెచ్‌-1బీ వీసాలపై ట్రంప్ ఉత్తర్వులు దిగ్భ్రాంతికరం అన్న సీఎం రేవంత్
  • తెలుగు టెకీల ప్రయోజనాల కోసం కేంద్రం వెంటనే స్పందించాలని డిమాండ్
  • ట్రంప్ నిర్ణయంతో తెలంగాణకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతుందన్న‌ మంత్రి శ్రీధర్ బాబు
  • దేశానికి వచ్చే రెమిటెన్స్‌లలో తెలంగాణకు నాలుగో స్థానం
  • ప్రధాని మోదీ, జైశంకర్ వెంటనే అమెరికాతో చర్చలు జరపాలని విజ్ఞప్తి
హెచ్‌-1బీ వీసాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ నిర్ణయం తెలుగు టెకీలపై, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు.

ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులు దిగ్భ్రాంతికి గురిచేశాయని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ముఖ్యమంత్రి అన్నారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా స్పందించారు. ఈ నిర్ణయంతో తెలుగు టెకీల ఆవేదన వర్ణనాతీతంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా అమెరికాకు సేవలు అందిస్తున్న నిపుణుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్ యుద్ధ ప్రాతిపదికన ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మరోవైపు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ అంశంపై శనివారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ట్రంప్ నిర్ణయంతో దేశంలో అత్యధికంగా నష్టపోయే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ఆయన స్పష్టం చేశారు. దేశానికి ఏటా వచ్చే మొత్తం రెమిటెన్స్‌లలో 8.1 శాతం వాటాతో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని, తాజా నిర్ణయం ఈ రాబడిపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు. ఈ విషయంపై కేంద్రానికి లేఖ రాస్తామని ఆయన తెలిపారు.

దేశ ఆర్థిక వ్యవస్థకు ఇంత నష్టం జరుగుతున్నా ప్రధాని మోదీ స్పందించకపోవడం దురదృష్టకరమని శ్రీధర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. "ట్రంప్ ఆలోచనా విధానం ఆయన ప్రియ మిత్రుడు మోదీకే బాగా తెలుసు" అంటూ ఎద్దేవా చేశారు. సమస్య తీవ్రతను ముందుగానే అంచనా వేసి అమెరికాతో చర్చలు జరపడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రధాని, విదేశాంగ మంత్రి మేల్కొని అమెరికాతో చర్చలు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు.


Revanth Reddy
H-1B Visa
Donald Trump
Telangana
Indian IT Professionals
Sridhar Babu
Remittances
Narendra Modi
S Jaishankar
US Relations

More Telugu News