Kandula Durgesh: ఏపీకి రండి .. పూర్తి భరోసా ఇస్తాం.. ప్రముఖ హోటల్స్ నిర్వాహకులకు మంత్రి కందుల దుర్గేశ్ ఆహ్వానం

Kandula Durgesh Invites Hotel Investors to Andhra Pradesh
  • బెంగుళూరులో జరిగిన ది ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (FHRAI) 55వ వార్షికోత్సవ వేడుకలు
  • ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ మంత్రి కందుల దుర్గేష్, టూరిజం ఎండీ, ఏపీటీఏ సీఈవో ఆమ్రపాలి కాట
  • ఏపీ పర్యాటక ఆతిధ్య రంగాల్లో పెట్టుబడులకున్న అవకాశాలను వివరించిన మంత్రి దుర్గేష్
  • పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే ఇన్వెస్టర్లకు భరోసా కల్పిస్తామని హామీ  
  • హోటళ్లకు అన్ని విధాల తోడ్పాటు అందిస్తామని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటక, ఆతిథ్య రంగాలకు స్వర్గధామమని, ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని, హోటళ్లకు అన్ని విధాలా తోడ్పాటు అందిస్తామని మంత్రి కందుల దుర్గేష్ ఇన్వెస్టర్లకు స్పష్టం చేశారు. బెంగుళూరులోని హోటల్ కాన్రాడ్‌లో ఈ నెల 18 నుంచి 20 వరకు జరిగిన ది ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (FHRAI) 55వ వార్షికోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్, టూరిజం ఎండీ, ఏపీటీఏ సీఈవో ఆమ్రపాలి కాట, నోడల్ ఆఫీసర్ (పెట్టుబడులు) సత్యప్రభలు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో ఏపీలో సుస్థిర పర్యాటక అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలు, నూతన పర్యాటక పాలసీ 2024-29, ఏపీ పర్యాటకానికి పారిశ్రామిక హోదా, పర్యాటక రంగంలో పెట్టుబడుల అవకాశాలను ఏపీ బృందం వివరించింది.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 55 వేల గదుల ఏర్పాటే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని, పెట్టుబడిదారులకు త్వరితగతిన అనుమతులు జారీ చేస్తున్నామని తెలిపారు. విభిన్న పర్యాటక ప్రక్రియల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అనువైన ప్రాంతమని పేర్కొన్నారు.

కేంద్రం సహకారంతో సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలో ఏపీని పర్యాటకుల ప్రధాన గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. పర్యాటక, ఆతిథ్య రంగాల్లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చే బాధ్యత తమదని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు.

అనంతరం ఏపీలో పర్యాటక పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పరిశీలించాల్సిందిగా హిల్టన్, తమరా లెజర్, ది పోస్ట్కార్డ్ హోటల్, రాడిసన్, సీషెల్ హోటల్స్ అండ్ రిసార్ట్స్, మారియట్ ఇంటర్నేషనల్, అట్మాస్పియర్ కోర్, స్టెర్లింగ్ హాస్పిటాలిటీ, క్లార్క్స్ ఎక్సోటికా, వైస్రాయ్, వండర్లా అమ్యూజ్మెంట్ పార్కులు, జీఆర్టీ హోటల్స్, పాపీ హోటల్స్, ప్రమోద్ గ్రూప్ మరియు రామాడా వంటి 40 మంది ప్రముఖ హోటల్ అండ్ హాస్పిటాలిటీ, రిసార్ట్స్, అమ్యూజ్మెంట్ పార్కుల ప్రతినిధులను ఆహ్వానించారు. అలానే నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే సిఐఐ భాగస్వామ్య సదస్సుకు రావాలని వారిని మంత్రి దుర్గేశ్ ఆహ్వానించారు. 

Kandula Durgesh
Andhra Pradesh Tourism
AP Tourism
Tourism Investment
Hotel Industry AP
FHRAI
Visakhapatnam CII Partnership Summit
Chandrababu Naidu
Pawan Kalyan
Hospitality Sector AP

More Telugu News