Durga Mandapam: రూ.300 కోట్లతో దుర్గా మండపం... ఎక్కడంటే...!

Durga Mandapam 300 Crore Durga Mandapam in Indore
  • మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్ నగరంలోని వీఐపీ పరస్పర్ నగర్ కాంప్లెక్స్ ప్రాంగణంలో ఏర్పాటు
  • 30 ఎకరాల విస్తీర్ణంలో మండపం
  • భక్తుల విరాళాల ద్వారా మండపం ఏర్పాటు 
దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్ నగరంలో దేశ చరిత్రలోనే అతిపెద్ద, అత్యంత ఖరీదైన దుర్గా మండపం రూపుదిద్దుకుంది. దాదాపు రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ అద్భుత కట్టడం, భక్తులకు, సందర్శకులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు కళాత్మక మహత్తును కూడా పంచనుంది.

ఇందౌర్‌లోని వీఐపీ పరస్పర్‌ నగర్ కాంప్లెక్స్ ప్రాంగణంలో దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ మండపాన్ని నిర్మించారు. ఇందులో దేశంలో ప్రసిద్ధి గాంచిన 12 జ్యోతిర్లింగాలు, ఇతర ప్రముఖ ఆలయాల నమూనాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా దక్షిణ భారత ఆలయ నిర్మాణ శైలిని అనుసరించి ఆలయాలను నెలకొల్పారు.

ఈ ప్రతిష్టాత్మక నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్‌ సహా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన 500 మందికి పైగా కళాకారులు మూడు నెలల పాటు అహర్నిశలు శ్రమించారు. మండప నిర్మాణానికి అవసరమైన ఖర్చులను కృష్ణగిరి పీఠాధిపతి వసంత్ విజయానంద్ గిరి మహారాజ్ ఆధ్వర్యంలో భక్తుల విరాళాల ద్వారా సమీకరించారు.

ఈ మండపంలో ప్రత్యేక ఆకర్షణగా 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన యాగశాల నిలుస్తోంది. ఇందులో 108 మంది పండితులు నవరాత్రి సందర్భంగా యజ్ఞాలు, హోమాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

నవరాత్రుల సందర్భంగా లక్షలాది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, విశాల పార్కింగ్, భోజనశాలలు, భద్రతా చర్యలు అన్నీ సిద్ధం చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.

ఈ మండపాన్ని సందర్శించే భక్తుల కోసం ప్రత్యేకంగా బంగారు కలశాలు కూడా అందుబాటులో ఉంచారు. వీటి ధరలు రూ.30 వేల నుంచి రూ.1 లక్ష వరకు ఉంటాయని సమాచారం. ఈ మండపంలో ఈ నెల 22 నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 

Durga Mandapam
Indore
Madhya Pradesh
Vasant Vijayanand Giri Maharaj
Jyotirlingas
Navaratri
Krishna Giri Peetham
South Indian Temple Architecture
VIP Paraspar Nagar Complex
Temple construction

More Telugu News