Chandrababu Naidu: వారిని ఆదుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం: సీఎం చంద్రబాబు

AP CM Chandrababu Naidu announces Rs 50000 per hectare aid to onion farmers
  • ఉల్లి రైతులకు హెక్టారుకు రూ.50 వేల ఆర్థిక సాయం
  • ధరల పతనంతో నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకే ఈ నిర్ణయం
  • రాష్ట్రవ్యాప్తంగా 45 వేల ఎకరాల్లో సాగు చేసే రైతులకు ప్రయోజనం
  • పంట అమ్మకంతో సంబంధం లేకుండా ఈ-పంట ఆధారంగా చెల్లింపులు
  • రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్ముతాం: సీఎం చంద్రబాబు
  • 15 నెలల్లో రైతు సంక్షేమానికి అనేక చర్యలు తీసుకున్నామన్న ప్రభుత్వం
ఉల్లి సాగు చేసే ప్రతి రైతుకు హెక్టారుకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వంపై ఆర్థిక భారం పడినా ఈ నిర్ణయం తీసుకున్నామని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సహాయం అందిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ధరల పతనంతో నష్టపోతున్న రైతులను ఆదుకోవడం తమ బాధ్యత అని స్పష్టం చేశారు. 

ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 45 వేల ఎకరాల్లో ఉల్లి సాగు చేస్తున్న రైతులకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరనుంది. రైతులు తమ పంటను ఆరబెట్టి, గ్రేడింగ్ చేసుకుని మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చని, వారి పంట అమ్మకాలతో సంబంధం లేకుండానే ‘ఈ-పంట’ ఆధారంగా ఈ ఆర్థిక సహాయాన్ని నేరుగా అందిస్తామని ప్రభుత్వం వివరించింది. "రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే సిద్ధాంతాన్ని మా ప్రభుత్వం బలంగా నమ్ముతుంది. అందుకే అన్నదాతలకు ఏ కష్టం వచ్చినా ఒక అడుగు ముందుకేసి అండగా నిలుస్తున్నాం" అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

గత 15 నెలల కూటమి ప్రభుత్వంలో రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, అనేక సందర్భాల్లో వారిని ఆదుకున్నామని సీఎం గుర్తుచేశారు. తమ హయాంలో రైతుల సమస్యలపై వేగంగా స్పందించినట్లు తెలిపారు. పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.3,200 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని, మద్దతు ధర లేక ఇబ్బంది పడిన మామిడి రైతులను రూ.260 కోట్లతో ఆదుకున్నామని వివరించారు. అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు పతనమైనప్పుడు హెచ్‌డీ పొగాకు రైతులను రూ.271 కోట్లతో, కోకో గింజల రైతులకు రూ.14 కోట్లు ఖర్చు చేసి కిలోకు రూ.50 చొప్పున చెల్లించి భరోసా కల్పించామని పేర్కొన్నారు.

అదేవిధంగా, కాఫీ పంటకు బెర్రీ బోరర్ వ్యాధి సోకినప్పుడు గిరిజన రైతులకు కేజీకి రూ.50 నష్టపరిహారం అందించామని, టమాటా రైతులు నష్టపోకుండా ఉండేందుకు మార్క్‌ఫెడ్ ద్వారా రూ.12 కోట్లతో పంటను కొనుగోలు చేశామని చంద్రబాబు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామని, కేవలం 15 నెలల కాలంలోనే ధాన్యం సేకరణకు రూ.13,500 కోట్లు ఖర్చు చేశామని ఆయన వివరించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ప్రభుత్వ సూచనలు పాటిస్తూ, డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Onion farmers
Farmer support
Agriculture subsidy
AP government
Rythu Sukhibhava
Crop loss compensation
Farmer welfare schemes
Agriculture in Andhra Pradesh

More Telugu News