కాజోల్ - జిషుసేన్ గుప్త ప్రధానమైన పాత్రలను పోషించిన 'ది ట్రయల్' సీజన్ వన్ వెబ్ సిరీస్, 2023 జులైలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అటు ఫ్యామిలీ ఎమోషన్స్.. ఇటు లీగల్ డ్రామాను టచ్ చేస్తూ సాగిన ఈ సిరీస్, 8 ఎపిసోడ్స్ తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. సెకండ్ సీజన్ 6 ఎపిసోడ్స్ తో ఈ నెల 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సీజన్ 2 ఎలా అనిపించిందనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: రాజీవ్ మేనన్ (జిషు సేన్ గుప్త) బాధ్యతా యుతమైన పదవిలో ఉంటూ, అవినీతి .. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటాడు. ఆ కేసు విషయంలో అతను జైలుకు వెళతాడు. ఆ సమయంలో తన ఇద్దరు పిల్లలైన అనన్య - అనైరాకి నయోనిక (కాజోల్) ఎంతో సపోర్ట్ గా నిలబడుతుంది. కుటుంబాన్ని నడపడం కోసం మళ్లీ నల్లకోటు వేసుకుంటుంది. అతి కష్టం మీద కేసు నుంచి భర్త బయటపడినప్పటికీ, ఆమెకి .. అతని మధ్య దూరం అలా ఉండిపోతుంది. 
   
రాజీవ్ కి దూరంగా ఉండలేక .. పిల్లల కోసం అతనికి దగ్గర కాలేక నయోనికా నానా అవస్థలు పడుతూ ఉంటుంది. తమ కారణంగా పిల్లల మనసులు దెబ్బతినకుండా చూస్తూ ఉంటుంది. ఇక రాజీవ్ తన ప్రత్యర్ధి అయిన నారాయణిపై గెలిచి, రాజకీయాలలో నిలదొక్కుకోవాలనే ఆలోచనలో ఉంటాడు. అతని రాజకీయ వ్యవహారాలను గురించి నయోనిక పెద్దగా పట్టించుకోకుండా, తన వృత్తిపైనే ఆమె పూర్తి ఫోకస్ పెడుతుంది. 

ఈ నేపథ్యంలోనే యశ్ -  రియా అనే ఒక ప్రేమ జంటకు సంబంధించిన డ్రగ్స్ కేసు నయోనిక దగ్గరికి వస్తుంది. అదే సమయంలో రాజకీయంగా నారాయణి వైపు నుంచి రాజీవ్ కి ఒక బలమైన సవాల్ ఎదురవుతుంది. ఈ రెండు సమస్యలు ఆ ఫ్యామిలీకి మరింత మనశ్శాంతి లేకుండా చేస్తాయి. అలాంటి పరిస్థితులలో నుంచి ఆ ఫ్యామిలీ ఎలా బయటపడుతుంది? అనేవి ఈ సిరీస్ లోని ఆసక్తికరమైన అంశాలు. 

విశ్లేషణ: వివాహమైన తరువాత ఒక స్త్రీ తన భర్త .. పిల్లలపైనే పూర్తి ఫోకస్ పెడుతుంది. భర్త తప్పు చేసినా .. పిల్లలు పొరపాట్లు చేసిన ఆమెనే అన్నీ సర్దుకుపోవలసి ఉంటుంది .. సవరించుకోవలసి ఉంటుంది. అలాంటి ఆ కుటుంబం పరువు ప్రతిష్ఠలు దెబ్బతీయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే, ఆ స్త్రీ వాటిని ఎలా ఎదుర్కొంటుంది? ఎలా తన కుటుంబాన్ని కాపాడుకుంటుంది? అనే ఒక బలమైన అంశం చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది. 

సాధారణంగా ఏ వెబ్ సిరీస్ కి సంబంధించి సీజన్ 2 వచ్చినా, మొదటి సీజన్ మాదిరిగా ఉందా? అంతకుమించి ఉందా? అనే ఒక సందేహం కలగకుండా ఉండదు. అలా చూసుకుంటే, ఈ సిరీస్ విషయంలో మొదటి సీజన్ కి ఎక్కువ మార్కులు ఇవ్వవలసి ఉంటుంది. ఎందుకంటే సీజన్ వన్ మాదిరిగా సెకండ్ సీజన్ మెప్పించలేకపోయింది. ఈ సీజన్ లో బలమైన ఎమోషన్స్ లేకపోవడం వలన కథ డీలాపడిపోయింది. 

రాజీవ్ పాత్ర వైపు నుంచి సరైన సీన్స్ పడలేదు. అలాగే నయోనిక దగ్గరికి వచ్చిన కేసులు .. ఆమె వాటిని డీల్ చేసిన విధానం కూడా అంత ఇంట్రెస్టింగ్ గా ఏమీ అనిపించవు. ఎక్కువ సన్నివేశాలను ఇంటికి .. ఆఫీసుకి .. కోర్టుకి పరిమితం చేశారు. నెక్స్ట్ ఏం జరుగుతుందా? అనే ఒక కుతూహలం రేకెత్తించకుండా సన్నివేశాలు సో సో గా సాగిపోతూ ఉంటాయి. 

పనితీరు: నిర్మాణ పరమైన విలువల పరంగా ఓకే, కాకపోతే కథ .. స్క్రీన్ ప్లే ఆశించిన స్థాయిలో లేవు. నిదానంగా సాగిపోయే కంటెంట్, పేలవమైన సన్నివేశాలను డ్రాప్ చేస్తూ వెళుతూ ఉంటుంది. సీనియర్ ఆర్టిస్టులు కావడం వలన, తమ పాత్రలను తమ దైన స్టైల్లో చేస్తూ వెళ్లారు. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఓకే అనిపిస్తాయి.

ముగింపు: 'ది ట్రయల్' సీజన్ వన్, ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. కాజోల్ పాత్ర వైపు నుంచి అల్లుకుంటూ వెళ్లిన బలమైన ఎమోషన్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యాయి. అయితే ఆ స్థాయిలో సీజన్ 2 మెప్పించలేకపోయిందనే అనాలి. ఎమోషన్స్ లేకుండా అల్లుకున్న బలహీనమైన సన్నివేశాలే అందుకు కారణంగా చెప్పుకోవాలి.