Chandrababu Naidu: నా ఇంటికి అడ్డంగా తాళ్లు కట్టిన వాళ్లే తమ మెడలకు ఉరితాళ్లు వేసుకున్నారు: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu says those who obstructed me faced consequences
  • మాచర్లలో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర ప్రజావేదిక సభ
  • మాచర్లలో అరాచకాలను సహించబోమని గట్టి హెచ్చరిక
  • పల్నాడు జీవనాడి వరికెపుడిశెల ప్రాజెక్టు పూర్తికి చంద్రబాబు హామీ
  • మాచర్ల మున్సిపాలిటీకి రూ. 50 కోట్ల అదనపు నిధులు
  • మాచర్లలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు నిర్ణయం
  • 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్న సీఎం
"మాచర్లకు అసలైన స్వాతంత్ర్యం వచ్చింది... ఇక్కడి ప్రజల ముఖాల్లో కనిపిస్తున్న సంతోషం శాశ్వతంగా ఉండాలి" అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శనివారం పల్నాడు జిల్లా మాచర్లలో నిర్వహించిన ‘ప్రజావేదిక’ సభలో ఆయన ప్రసంగిస్తూ, ఈ ప్రాంతంలో గతంలో జరిగిన అరాచకాలపై తీవ్రంగా స్పందించారు. రౌడీయిజం, విధ్వంసాలకు పాల్పడితే ఇకపై చూస్తూ ఊరుకోబోమని, అలాంటి వారి ప్రవర్తన మార్చుకోకపోతే ప్రజలు క్షమించరని ఆయన గట్టిగా హెచ్చరించారు. తనను గతంలో మాచర్లకు రానీయకుండా ఇంటికి తాళ్లు కట్టిన వారే, తమ మెడలకు ఉరితాళ్లు వేసుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పరిసరాల్లోని చెత్తతో పాటు రాష్ట్రంలోని రాజకీయ చెత్తను కూడా పూర్తిగా తొలగిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు.

పలనాడు అభివృద్ధి నా బాధ్యత

పల్నాడు జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. "పల్నాడులో తలసరి ఆదాయం తక్కువగా ఉంది. మాచర్ల, గురజాల ప్రాంతాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఇతర ప్రాంతాలతో సమానంగా నిలుపుతాం," అని ఆయన భరోసా ఇచ్చారు. ఈ ప్రాంత రైతుల జీవనాడి అయిన వరికెపుడిశెల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసే బాధ్యతను తానే స్వయంగా తీసుకుంటానని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు, లక్ష మందికి తాగునీరు అందుతుందని వివరించారు. మొదటి దశలో 1.45 టీఎంసీలు, రెండో దశలో 6.3 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. అలాగే, జల్ జీవన్ మిషన్ ద్వారా రాబోయే మూడేళ్లలో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని తెలిపారు.

పోలవరం నుంచి నదుల అనుసంధానం వరకు

రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం విధ్వంసం చేసిందని చంద్రబాబు ఆరోపించారు. "మేం 76 శాతం పనులు పూర్తి చేస్తే, ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంసం మొదలుపెట్టి పోలవరం డయాఫ్రాం వాల్ కొట్టుకుపోయేలా చేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు పునర్నిర్మాణ పనులు చేపట్టింది. 2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం" అని ఆయన పునరుద్ఘాటించారు. రాష్ట్రంలోని నదుల అనుసంధానంపై కూడా ఆయన కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే గోదావరి-కృష్ణా నదులను కలిపామని, త్వరలోనే గోదావరిని వంశధారతో, ఆ తర్వాత పెన్నా నదితో అనుసంధానిస్తామని తెలిపారు. సమర్థవంతమైన నీటి నిర్వహణ వల్లే ఈ ఏడాది రాష్ట్రంలోని 94 శాతం రిజర్వాయర్లు నిండాయని గుర్తుచేశారు.

రైతులకు, స్థానిక ప్రజలకు వరాలు

ఈ సందర్భంగా మాచర్ల నియోజకవర్గానికి పలు వరాలు ప్రకటించారు. మాచర్ల మున్సిపాలిటీ అభివృద్ధికి అదనంగా రూ. 50 కోట్లు కేటాయిస్తున్నామని, వంద పడకల ఆసుపత్రిని కూడా మంజూరు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి నిర్మించాలనే ఆలోచన ఉందన్నారు. రైతుల కోరిక మేరకు ఈ ప్రాంతానికి మిర్చి బోర్డు తీసుకురావడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పంట నాణ్యతపై దృష్టి పెట్టాలని రైతులకు సూచిస్తూ, అధిక దిగుబడి కోసం యూరియా వంటివి వాడొద్దని, ఇప్పుడు అంతర్జాతీయంగా పంటలను పరీక్షించాకే కొనుగోలు చేస్తున్నారని గుర్తుచేశారు. చారిత్రక పల్నాటి వీరారాధన ఉత్సవాలను ఇకపై ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుందని ఆయన ప్రకటించారు.
Chandrababu Naidu
Macherla
Palnadu
Varikepudisela Project
Polavaram Project
River Linking
Andhra Pradesh Politics
Irrigation Project
Jal Jeevan Mission
Mirchi Board

More Telugu News