Revanth Reddy: ఒక ఆడబిడ్డపై నలుగురు కలిసి దాడి చేస్తున్నారు!: కవిత వ్యవహారంపై రేవంత్ రెడ్డి

Revanth Reddy on Kavitha Allegations Family Property Disputes
  • కవిత వ్యవహారమంతా కుటుంబం, ఆస్తి పంపకాల వివాదమేనని వ్యాఖ్య
  • కాళేశ్వరం అక్రమాలపై దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలని కిషన్ రెడ్డి పదేపదే చెప్పారని వెల్లడి
  • స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న రేవంత్ రెడ్డి
  • పార్టీ ఫిరాయింపులపై నిర్దిష్ట నియమాలు ఏవీ లేవన్న ముఖ్యమంత్రి
కల్వకుంట్ల కవిత వ్యవహారం, పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ, కవిత వ్యవహారం పూర్తిగా కుటుంబం, ఆస్తి పంపకాల వివాదమేనని వ్యాఖ్యానించారు. ఒక ఆడబిడ్డపై నలుగురు కలిసి దాడి చేస్తున్నారని అన్నారు. కుటుంబ వ్యవహారంతో సామాన్య ప్రజలకు ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు సామాజికంగా బహిష్కరించారని వ్యాఖ్యానించారు. 2014-19 మధ్య కేసీఆర్ కేబినెట్‌లో ఒక్క మహిళ కూడా లేరని గుర్తు చేశారు.

ఉద్యమం పేరుతో కేసీఆర్ కొన్ని వందల మంది పిల్లల ఉసురు పోసుకున్నారని ఆయన ఆరోపించారు. అది ఊరికే పోలేదని అన్నారు.

హైదరాబాద్ మెట్రో విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేటీఆర్ కలిసి అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు. ఎల్ అండ్ టీతో ఒప్పందం చేసుకుంటేనే అనుమతులు ఇస్తామని కేంద్రం చెబుతోందని అన్నారు. కేంద్రంలో ఉన్న కిషన్ రెడ్డి ఇలాంటి మెలికలు పెడుతున్నారని విమర్శించారు.

కాళేశ్వరం అక్రమాలపై దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలని కిషన్ రెడ్డి పదేపదే డిమాండ్ చేశారని, అలా చేస్తే 48 గంటల్లోనే ఈ కేసు విచారణ చేపట్టేలా చూస్తానని అన్నారని తెలిపారు. సీబీఐకి ఈ కేసును ఇచ్చి ఇన్ని రోజులు అవుతున్నా కిషన్ రెడ్డి ఎక్కడా మాట్లాడటం లేదని అన్నారు. సీబీఐ దర్యాప్తు ఆపాలని కేటీఆర్ కోరడంతో కిషన్ రెడ్డి దానిని అమలు చేశారని ఆరోపించారు. వారిద్దరి మధ్య అవినాభావ సంబంధం ఉందని అన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోలేదు

స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ముఖ్యమంత్రి చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి మూడు బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. రాష్ట్రపతి నిర్ణయం తీసుకునే గడువు అంశం కోర్టు పరిధిలో ఉందని అన్నారు. దీనిపై సుప్రీంకోర్టు ఏం చెబుతుందో వేచి చూస్తున్నామని తెలిపారు. న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

ఎమ్మెల్యేలు పార్టీ మారిన అంశంపై స్పందించిన ముఖ్యమంత్రి

ఎమ్మెల్యేలు పార్టీ మారిన అంశంపై కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. పార్టీ ఫిరాయింపులపై నిర్దిష్ట నియమాలు ఏవీ స్పష్టంగా లేవని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన అంశంపై బీఆర్ఎస్ నేతలకే స్పష్టత లేదని అన్నారు. ఆ పార్టీకి 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అసెంబ్లీలో హరీశ్ రావు చెప్పారని గుర్తు చేశారు. 37 మంది కాదని కేటీఆర్ ఇంకో మాట చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఇంటికొచ్చిన వారికి కండువా వేస్తే పార్టీ మారినట్లు అవుతుందా? అని ప్రశ్నించారు.
Revanth Reddy
Kavitha
Telangana
BRS
KCR family
Kaleshwaram project
Kishan Reddy
MLAs defection

More Telugu News