Adani Group: లాభాలకు బ్రేక్: పడిపోయిన మార్కెట్లను ఆదుకున్న అదానీ షేర్లు!

Adani Shares Rescue Falling Markets Break to Profits
  • స్టాక్ మార్కెట్లో లాభాల స్వీకరణ
  • మూడు రోజుల జోరుకు అడ్డుకట్ట
  • ఐటీ, బ్యాంకింగ్ రంగాల దిగ్గజాల్లో అమ్మకాల ఒత్తిడి
  • సెబీ క్లీన్ చిట్‌తో అదానీ షేర్ల ర్యాలీ!
భారత స్టాక్ మార్కెట్లలో వరుస మూడు రోజుల లాభాల జోరుకు శుక్రవారం అడ్డుకట్ట పడింది. ఐటీ, బ్యాంకింగ్ వంటి కీలక రంగాల దిగ్గజ షేర్లలో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు నష్టాల్లో ముగిశాయి. అయితే, అదానీ గ్రూప్ షేర్లలో అనూహ్యమైన ర్యాలీ చోటుచేసుకోవడం మార్కెట్లను భారీ పతనం నుంచి కాపాడింది. అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణల విషయంలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) క్లీన్ చిట్ ఇవ్వడం అదానీ షేర్లకు కలిసొచ్చింది.

ట్రేడింగ్ ముగిసే సమయానికి, బీఎస్ఈ సెన్సెక్స్ 387.73 పాయింట్లు నష్టపోయి 82,626.23 వద్ద స్థిరపడింది. అదేవిధంగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 96.55 పాయింట్లు తగ్గి 25,327.05 వద్ద ముగిసింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే బలహీనంగా కదలాడిన సూచీలు, అమ్మకాల ఒత్తిడితో మరింత కిందకు పడిపోయాయి. ఒక దశలో సెన్సెక్స్ 82,485.92 పాయింట్ల కనిష్ఠ స్థాయిని కూడా తాకింది.

ఒకవైపు మార్కెట్ మొత్తం డీలా పడినా, అదానీ గ్రూప్ స్టాక్స్ మాత్రం దుమ్మురేపాయి. అదానీ పవర్ షేరు ఏకంగా 13.42% ఎగబాకగా, అదానీ టోటల్ గ్యాస్ 7.55% లాభపడింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ 5.25%, అదానీ పోర్ట్స్ 1.15% మేర వృద్ధిని నమోదు చేశాయి.

నష్టపోయిన షేర్ల జాబితాలో హెచ్‌సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, కోటక్ బ్యాంక్, టాటా మోటార్స్, ఐటీసీ వంటి దిగ్గజాలు ఉన్నాయి. మరోవైపు, అదానీ పోర్ట్స్‌తో పాటు ఎస్‌బీఐ, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకీ షేర్లు లాభాల్లో ముగిశాయి. రంగాల వారీగా చూస్తే.. ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్, ఆటో, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ సూచీలు నష్టపోయాయి. అయితే, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు నిలకడగా ట్రేడ్ అయ్యాయి.

ఇక డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ స్వల్పంగా బలపడి 88.10 వద్ద ముగిసింది. గత సెషన్‌లో ఇది 88.13 వద్ద ఉంది.
Adani Group
Stock Market
Sensex
Nifty
Share Market
Adani Power
SEBI
Indian Rupee
Hindenburg Research
Adani Enterprises

More Telugu News