Pawan Kalyan: బొండా ఉమ ప్రశ్నకు అసెంబ్లీలో పవన్ కల్యాణ్ రిప్లయ్... వీడియో ఇదిగో!

Pawan Kalyans Reply to Bonda Uma in Assembly on Pollution
  • ఆయన (ఉమ) తన వ్యాఖ్యలు సరిదిద్దుకోవాలేమోనన్న పవన్
  • పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అందరికీ అందుబాటులో ఉంటుందని స్పష్టీకరణ
  • త్వరలోనే బోర్డును పూర్తిస్థాయిలో పనిచేయిస్తానని హామీ
రాష్ట్రంలో కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలపై చర్యలు తీసుకునే విషయంలో ఏ ఒక్కరినీ లక్ష్యంగా చేసుకోబోమని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ప్రసక్తే లేదని ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అదే సమయంలో, నిబంధనలు అతిక్రమించే పరిశ్రమలపై మరీ కఠినంగా వ్యవహరిస్తే చాలా కంపెనీలు మూతపడిపోయే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. శుక్రవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ అడిగిన ప్రశ్నకు పవన్ కల్యాణ్ సుదీర్ఘంగా సమాధానమిచ్చారు.

కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అందుబాటులో ఉండడం లేదంటూ బొండా ఉమ చేసిన వ్యాఖ్యలపై  పవన్ స్పందించారు. "కాలుష్య నియంత్రణ మండలి అందుబాటులో ఉండదనే మాట సరికాదు. ఆయన తన మాటలు సరిదిద్దుకోవాలేమో తెలియదు కానీ, ఒక్క మాట చెప్పదలచుకున్నాం. కాలుష్య నియంత్రణ మండలి అంటే పరిశ్రమలకు మాత్రమే సంబంధించినది అనుకుంటాం. కానీ ఇది ప్రజలకు కూడా సంబంధించినది. నేను బాధ్యత తీసుకున్నాక, ఎవరు వెళ్లినా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయం అందరికీ అందుబాటులో ఉంచాం" అని స్పష్టం చేశారు. 

కాలుష్య నియంత్రణ మండలిలో ఉన్న సమస్యలను కూడా పవన్ కల్యాణ్ అంగీకరించారు. బోర్డులో తీవ్రమైన సిబ్బంది కొరత, నిధుల సమస్య ఉందని ఒప్పుకున్నారు. ఈ ఇబ్బందులను సభ్యులు కూడా అర్థం చేసుకోవాలని కోరారు. త్వరలోనే సిబ్బంది నియామకాలు చేపట్టి, బోర్డు పూర్తిస్థాయిలో సమర్థవంతంగా పనిచేసేలా తాను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని సభకు హామీ ఇచ్చారు.

ఇక, రాంకీ సంస్థ నిబంధనలు ఉల్లంఘించిన విషయంలో ఇప్పటికే చర్యలు తీసుకున్నాం, వారికి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశాం" అని తెలిపారు. అయితే, కేవలం ఒక సంస్థనో, ఒక వ్యక్తినో లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురిచేయడం ప్రభుత్వ విధానం కాదని ఆయన తేల్చి చెప్పారు. కేవలం వైసీపీకి సంబంధించిన వ్యక్తుల కంపెనీలనే లక్ష్యంగా చేసుకోకుండా, రాష్ట్రవ్యాప్తంగా నిబంధనలు పాటించని ప్రతి ఒక్కరిపైనా సమానంగా చర్యలు ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు. ఈ చర్యల వల్ల పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామని కూడా భరోసా ఇచ్చారు.
Pawan Kalyan
Andhra Pradesh
Pollution Control Board
Bonda Uma
AP Assembly
Ramky
Environmental Issues
Vijayawada
industries
YSRCP

More Telugu News