Donald Trump: యూఎస్ క్యాపిటల్ భవనం వెలుపల ట్రంప్ బంగారు విగ్రహం

12 foot golden statue of Trump holding Bitcoin unveiled outside US Capitol
  • యూఎస్ క్యాపిటల్ భవనం వెలుపల ట్రంప్ 12 అడుగుల బంగారు విగ్రహం
  • చేతిలో బిట్‌కాయిన్‌తో విగ్రహం రూపకల్పన
  • కీలక వడ్డీ రేట్లను 0.25 శాతం మేర తగ్గించిన అమెరికా ఫెడ్‌
  • క్రిప్టోకరెన్సీపై చర్చను ప్రోత్సహించేందుకే విగ్రహం ఏర్పాటు అన్న నిర్వాహకులు
  • ఫెడ్ నిర్ణయంపై ట్రంప్ స్పందన కోసం సర్వత్రా ఆసక్తి
అమెరికాలో గురువారం రెండు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒకవైపు దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేలా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించగా, మరోవైపు అదే సమయంలో యూఎస్ క్యాపిటల్ భవనం వెలుపల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ స్వర్ణ విగ్రహం వెలవడం అందరి దృష్టినీ ఆకర్షించింది. 12 అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహంలో ట్రంప్ తన చేతిలో ఒక బిట్‌కాయిన్‌ను పట్టుకుని ఉన్నట్లు రూపొందించారు.

ఈ విగ్రహాన్ని క్రిప్టోకరెన్సీ ఇన్వెస్టర్లు ఏర్పాటు చేసినట్లు ఏబీసీ అనుబంధ సంస్థ డబ్ల్యూజేఎల్‌ఏ వెల్లడించింది. డిజిటల్ కరెన్సీ భవిష్యత్తు, దేశ ద్రవ్య విధానం, ఆర్థిక మార్కెట్లలో ప్రభుత్వ జోక్యం వంటి అంశాలపై విస్తృత చర్చను రేకెత్తించేందుకే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. క్రిప్టోకరెన్సీకి ట్రంప్ బహిరంగంగా మద్దతు పలికినందుకు గౌరవసూచకంగా కూడా దీనిని ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ విగ్రహం ఏర్పాటుతో ఆ ప్రాంతంలో జనసందోహం నెలకొంది.

ఇదే సమయంలో అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు (0.25శాతం) తగ్గించింది. గ‌తేడాది డిసెంబర్ తర్వాత వడ్డీ రేట్లను తగ్గించడం ఇదే తొలిసారి. ఈ నిర్ణయంతో స్వల్పకాలిక వడ్డీ రేటు 4.3 శాతం నుంచి సుమారు 4.1 శాతానికి దిగివచ్చింది. ఈ ఏడాది మరో రెండుసార్లు, 2026లో ఒకసారి వడ్డీ రేట్ల కోత ఉండే అవకాశం ఉందని ఫెడ్ సంకేతాలు ఇచ్చింది.

గతంలో ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్‌పై, ఆయన విధానాలపై ట్రంప్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫెడ్ తాజా నిర్ణయంపై ట్రంప్ ఎలా స్పందిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Donald Trump
US Capitol
Gold Statue
Federal Reserve
Interest Rates
Cryptocurrency
Bitcoin
Jerome Powell
US Economy

More Telugu News