Gorantla Buchaiah Chowdary: సిగ్గు, శరం ఉంటే ఇప్పటికైనా అసెంబ్లీకి రావాలి: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

Gorantla Buchaiah Slams YSRCP MLAs for Skipping Assembly
  • జగన్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లడం ఖాయమన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి
  • స్కామ్ లు భయటపడతాయనే భయంతోనే అసెంబ్లీకి రావడం లేదని ఎద్దేవా
  • ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వ్యాఖ్య
మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎప్పటికైనా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లడం ఖాయమని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా వైసీపీ ఎమ్మెల్యేలు పిరికిపందల్లా పారిపోతున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు.

ప్రజలు తమ సమస్యలు పరిష్కరిస్తారని నమ్మి గెలిపిస్తే, సభకు రాకుండా ప్రతిపక్ష హోదా కావాలంటూ కాలయాపన చేయడంపై ఆయన మండిపడ్డారు. గత ఐదేళ్ల పాలనలో చేసిన స్కామ్‌లు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే వైసీపీ నేతలు శాసనసభకు ముఖం చాటేస్తున్నారని గోరంట్ల ఆరోపించారు. ఐదేళ్ల జగన్ పాలన చూసిన ప్రజలు, కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదనే విషయాన్ని వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలని ఎద్దేవా చేశారు.

చట్ట ప్రకారం అసెంబ్లీలో 10 శాతం సభ్యుల బలం లేనప్పుడు ప్రతిపక్ష హోదా ఎలా కల్పిస్తారని ఆయన సూటిగా ప్రశ్నించారు. సిగ్గు, శరం ఉంటే ఇప్పటికైనా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని హితవు పలికారు. వైసీపీనేతలు శాసన మండలికి హాజరవుతూ, శాసనసభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు. 12 ఏళ్లుగా తనపై ఉన్న ఈడీ కేసులను జగన్ ఎందుకు వాయిదా వేయించుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. 
Gorantla Buchaiah Chowdary
Jagan Mohan Reddy
Rajamahendravaram Central Jail
TDP MLA
Andhra Pradesh Assembly
YSRCP
Assembly Sessions
Opposition Status
ED Cases
Andhra Pradesh Politics

More Telugu News