Team India: దుబాయ్‌లో టీమిండియాకు 'రింగ్ ఆఫ్ ఫైర్' సవాల్.. క్యాచ్‌లు పట్టడం అంత ఈజీ కాదు..!

Team India faces Ring of Fire challenge in Dubai
  • దుబాయ్ స్టేడియంలోని 'రింగ్ ఆఫ్ ఫైర్' లైట్లపై టీమిండియా ప్రత్యేక దృష్టి
  • బౌండరీ వద్ద హై క్యాచ్‌లు పట్టడం పెద్ద సవాల్ అంటున్న ఫీల్డింగ్ కోచ్
  • రెప్పపాటులో బంతి కనిపించకుండా పోయే ప్రమాదం ఉందని వెల్లడి
  • లైట్లతో పాటు గాల్లో తేమ కూడా ఫీల్డింగ్‌పై ప్రభావం చూపుతోందని వ్యాఖ్య‌
  • ప్రత్యేక ప్రాక్టీస్‌తో ఆటగాళ్లను సిద్ధం చేస్తున్న ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్
ఆసియా కప్‌లో అద్భుత ప్రదర్శనతో దూసుకెళుతున్న భారత జట్టుకు దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఒక కొత్త సవాల్ ఎదురవుతోంది. సాధారణంగా స్టేడియాల్లో ఉండే స్తంభాల లైట్లకు భిన్నంగా, ఇక్కడి స్టేడియం పైకప్పు చుట్టూ గుండ్రంగా అమర్చిన 'రింగ్ ఆఫ్ ఫైర్' ఫ్లడ్‌లైట్లు ఫీల్డర్లకు కఠిన పరీక్ష పెడుతున్నాయి. ఈ ప్రత్యేక లైట్ల వెలుగులో ఫీల్డింగ్ చేయడం, ముఖ్యంగా బౌండరీ లైన్ వద్ద గాల్లోకి లేచిన బంతిని అంచనా వేయడం కష్టంగా మారుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు టీమిండియా ప్రత్యేక ఫీల్డింగ్ డ్రిల్స్ నిర్వహిస్తోంది.

ఈ అంశంపై భారత జట్టు ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ స్పందించాడు. దుబాయ్ స్టేడియంలోని లైట్ల వ్యవస్థ విభిన్నంగా ఉంటుందని, డోమ్ ఆకారంలో ఉన్న పైకప్పుకు అమర్చిన ఈ 'రింగ్ ఆఫ్ ఫైర్' కారణంగా ఫీల్డర్లు ఇబ్బంది పడతారని ఆయన వివరించాడు. "బౌండరీ వద్దకు దూసుకొచ్చే హై క్యాచ్‌ల సమయంలో, బంతి ఆ లైట్ల వెలుగు గుండా ప్రయాణిస్తున్నప్పుడు రెప్పపాటులో కంటికి కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు ఆటగాళ్లు కంగారుపడతారు" అని దీలిప్‌ అన్నాడు. ఈ వివరాలను బీసీసీఐ 'ఎక్స్'లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో వెల్లడించాడు.

లైట్ల సమస్యతో పాటు దుబాయ్‌లోని అధిక తేమ కూడా మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేస్తుందని దిలీప్ పేర్కొన్నాడు. "వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల బంతి గాల్లో ప్రయాణించే తీరు, కిందకు దిగే వేగం ఇతర ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. దీనివల్ల హై క్యాచ్‌లను అంచనా వేయడం కష్టమవుతుంది" అని తెలిపాడు.

ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆటగాళ్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు ఆయన వివరించాడు. "క్షణకాలం బంతి కనిపించకపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదని, దాన్ని అందుకోవడానికి ఇంకా సమయం ఉంటుందని ఆటగాళ్లకు అర్థమయ్యేలా వైవిధ్యభరితమైన ప్రాక్టీస్ సెషన్లు నిర్వహిస్తున్నాం. చేతులతో బంతిని పట్టుకోవడంతో పాటు, వేగంగా బంతి వద్దకు చేరుకోవడానికి ఫుట్‌వర్క్ కూడా చాలా ముఖ్యం" అని చెప్పుకొచ్చాడు.

ఇప్పటికే ఆసియా కప్‌లో ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ గెలిచిన భారత్, సూపర్ ఫోర్ దశకు అర్హత సాధించిన విష‌యం తెలిసిందే. రేపు అబుదాబిలో ఒమన్‌తో తమ చివరి గ్రూప్ మ్యాచ్ ఆడనుంది.
Team India
Asia Cup 2025
Dubai
Ring of Fire
T Dilip
Fielding coach
Cricket
High catches
Humidity
Practice sessions

More Telugu News