Pawan Kalyan: 'ఓజీ' టికెట్ ధరపై దుమారం.. పవన్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు

Pawan Kalyan OG Movie Ticket Price Controversy Sparks Criticism
  • పవన్ కల్యాణ్ ‘ఓజీ’ సినిమాకు ఏపీ సర్కార్ ప్రత్యేక అనుమతులు
  • బెనిఫిట్ షో టికెట్ ధర రూ. 1000గా నిర్ధారణకు ఆమోదం
  • 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు వెసులుబాటు
  • ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు, నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు
  • డిప్యూటీ సీఎంగా పవన్ అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు
  • రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదంటూ సోషల్ మీడియాలో ఫైర్
డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్రానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ సినిమా బెనిఫిట్ షో టికెట్‌ను ఏకంగా వెయ్యి రూపాయలకు అమ్ముకోవడానికి, పది రోజుల పాటు ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వివరాల్లోకి వెళితే... సుజీత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ‘ఓజీ’ చిత్రం వచ్చే వారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం బుధవారం ప్రత్యేక జీఓ జారీ చేసింది. దీని ప్రకారం, ఈ నెల 24న రాత్రి ఒంటి గంటకు ప్రదర్శించే బెనిఫిట్ షో టికెట్‌ ధరను జీఎస్టీతో కలిపి రూ. 1000గా నిర్ణయించారు. అంతేకాకుండా, సినిమా విడుదలైన నాటి నుంచి పది రోజుల పాటు, అంటే అక్టోబరు 4 వరకు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 125, మల్టీప్లెక్స్‌లలో రూ. 150 అదనంగా పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ప్రభుత్వ నిర్ణయంపై చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్.. ఏపీ ప్రభుత్వానికి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌కు కృతజ్ఞతలు తెలియజేసింది.

అయితే, ఈ నిర్ణయంపై వైసీపీ నేతలు, నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కల్యాణ్ తన సినిమా కోసం అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో ఉల్లి రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతుంటే, కేవలం మూడు గంటల సినిమా కోసం వెయ్యి రూపాయల టికెట్‌కు అనుమతి ఇవ్వడం దారుణమని సామాజిక మాధ్యమాల్లో విమర్శిస్తున్నారు. పరిమిత బడ్జెట్‌తో తీసిన ‘ఓజీ’కి ఇంత భారీ పెంపు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.

గతంలో సినిమా బడ్జెట్‌ను బట్టి టికెట్ ధరల పెంపునకు అనుమతులు ఇచ్చేవారని, కానీ ‘ఓజీ’ విషయంలో ఆ నిబంధన పాటించలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ‘రైతులు నాలుగు నెలలు కష్టపడి పండించిన ఉల్లికి 30 పైసలు, టమాటాకు రూపాయి.. కానీ మూడు గంటల సినిమాకు వెయ్యి రూపాయలా’ అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా, ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఇప్పటికే యు/ఏ సర్టిఫికెట్ జారీ చేసిన విషయం తెలిసిందే.
Pawan Kalyan
OG Movie
OG Ticket Price
AP Government
Jagan Mohan Reddy
TDP
Andhra Pradesh
Movie Ticket Hike
DVV Danayya
Kandula Durgesh

More Telugu News