Rahul Gandhi: ఆధారాలతో 'ఓట్ల దొంగతనం' గుట్టురట్టు చేసిన రాహుల్

Rahul Gandhi Exposes Voter Fraud with Evidence
  • బీజేపీ, ఎన్నికల సంఘంపై రాహుల్ 'ఓట్ల దొంగతనం' ఆరోపణలు 
  • ఢిల్లీలో ఆధారాలతో మీడియా ముందుకు వచ్చిన ప్రతిపక్ష నేత
  • కర్ణాటకలోని అలంద్‌లో 6 వేలకు పైగా ఓట్ల తొలగింపు యత్నం
  • ఓట్ల దొంగలకు సీఈసీ రక్షణగా నిలుస్తున్నారని తీవ్ర విమర్శ
  •  ఇది ఆరంభం మాత్రమే, త్వరలో 'హైడ్రోజన్ బాంబ్' పేలుస్తానని వెల్లడి
దేశంలో వ్యవస్థీకృతంగా 'ఓట్ల దొంగతనం' జరుగుతోందని, ఈ కుట్రకు పాల్పడుతున్న వారిని సాక్షాత్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ కాపాడుతున్నారని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో కాసేపటి క్రితం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితా నుంచి పేర్లను ఎలా తొలగిస్తున్నారో ఆధారాలతో వివరించారు.

కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో జరిగిన ఘటనను ఆయన ఉదాహరణగా చూపించారు. అక్కడ ఏకంగా 6,018 ఓట్లను అక్రమంగా తొలగించేందుకు ప్రయత్నం జరిగిందని రాహుల్ ఆరోపించారు. "ఇది అనుకోకుండా బయటపడిన ఒక ఉదంతం మాత్రమే. అలంద్‌లో మొత్తం ఎన్ని ఓట్లు తొలగించారో మాకు తెలియదు. కానీ 6,018 ఓట్ల తొలగింపు వ్యవహారం మాత్రం పట్టుబడింది" అని ఆయన తెలిపారు.

ఈ కుట్ర ఎలా బయటపడిందో వివరిస్తూ "ఒక బూత్ లెవెల్ అధికారి తన బంధువు పేరు ఓటర్ల జాబితాలో కనిపించకపోవడంతో ఆరా తీశారు. ఆమె బంధువు ఓటును ఒక పొరుగు వ్యక్తి దరఖాస్తు ద్వారా తొలగించినట్లు రికార్డుల్లో ఉంది. ఆ పొరుగు వ్యక్తిని అడగ్గా, తనకేమీ తెలియదని, తాను ఏ దరఖాస్తు చేయలేదని చెప్పారు. అంటే, ఓటు తొలగించిన వ్యక్తికి తెలియదు, ఓటు పోగొట్టుకున్న వ్యక్తికీ తెలియదు. మధ్యలో మరేదో శక్తి ఈ ప్రక్రియను హైజాక్ చేసి ఓట్లను తొలగించింది" అని రాహుల్ వివరించారు.

ఈ సందర్భంగా బీజేపీ, ఎన్నికల సంఘంపై రాహుల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "నేను ఈ మాటను తేలిగ్గా అనడం లేదు. లోక్‌సభ ప్రతిపక్ష నేతగా చెబుతున్నాను. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓట్ల దొంగలకు రక్షణ కల్పిస్తున్నారు. ఇది పచ్చి నిజం, ఇందులో ఎలాంటి గందరగోళం లేదు" అని ఆయన తీవ్రంగా ఆరోపించారు.

గతంలో తాను చెప్పినట్లుగా త్వరలోనే 'హైడ్రోజన్ బాంబ్' లాంటి బలమైన సాక్ష్యాలను బయటపెడతానని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈరోజు చూపించింది కేవలం దాని ట్రైలర్ మాత్రమేనని, అసలు విషయం ముందుందని ఆయన పేర్కొన్నారు.
Rahul Gandhi
Voter fraud
Election Commission of India
CEC Gyanesh Kumar
Karnataka Aland
Voter list
Vote deletion
Electoral malpractice
Congress party
Lok Sabha elections

More Telugu News