Raghava Lawrence: సేవ అంటే ఇదే.. రాఘవ లారెన్స్ కొత్త కార్యక్రమంపై ప్రశంసల వెల్లువ

Raghava Lawrence Launches Kanmani Annadana Vindu Food Program
  • అమ్మ పేరుతో రాఘవ లారెన్స్ కొత్త సేవా కార్యక్రమం
  • 'కణ్మణి అన్నదాన విందు'కు శ్రీకారం
  • ధనవంతులు తినే భోజనం పేద పిల్లలకు అందించడమే లక్ష్యం
  • తన ప్రయత్నానికి మద్దతిస్తున్న వారికి 'ఎక్స్‌'లో కృతజ్ఞతలు
  • సేవలోనే దైవం ఉందని బలంగా నమ్మే లారెన్స్
ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ తన పెద్ద మనసును మరోసారి చాటుకున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలతో ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న ఆయన, ఇప్పుడు తన తల్లి పేరు మీద 'కణ్మణి అన్నదాన విందు' అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ధనవంతులు తినే రుచికరమైన, నాణ్యమైన భోజనాన్ని.. అలాంటి ఆహారం ఎప్పుడూ రుచి చూడని నిరుపేద చిన్నారులకు అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.

ఈ కొత్త కార్యక్రమానికి ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందన పట్ల లారెన్స్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. "నేను ప్రారంభించిన 'కణ్మణి అన్నదాన విందు'కు మీరంతా చూపిస్తున్న ప్రేమ, మద్దతుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రోత్సాహమే ఈ సేవా ప్రయాణాన్ని కొనసాగించేందుకు నాకు బలాన్ని ఇస్తుంది. మీ అందరి ఆశీస్సులతో ప్రజలకు సేవ చేసేందుకు నా వంతు కృషి చేస్తూనే ఉంటాను" అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం గురించి లారెన్స్ మాట్లాడుతూ... "ధనికులు తినే విందు భోజనం పేదలకు కూడా చేరాలి. ఇరవై ఏళ్ల క్రితం మా ఇంట్లో 60 మంది పిల్లలకు భోజనం పెట్టాను. ఇప్పుడు అలాంటి ఆహారం ఎప్పుడూ రుచి చూడని పిల్లలను వెతికి మరీ వారికి అందించాలనుకుంటున్నాను. సేవే దైవం. ఈ రోజు నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మీ అందరి దీవెనలు కావాలి" అని చెప్పుకొచ్చారు.

లారెన్స్ సేవా కార్యక్రమాలు చేయడం కొత్తేమీ కాదు. ఆయన ఇప్పటికే 'మాత్రం' అనే సంస్థ ద్వారా ఎంతోమంది పేదలకు, దివ్యాంగులకు అండగా నిలుస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి నటుడు కేపీవై బాలకు సాయం చేయడం, కూతురి చదువు కోసం భార్య మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టిన ఓ తండ్రికి అండగా నిలవడం వంటివి ఆయన సేవా నిరతికి నిదర్శనం. గత ఏడాది పేద రైతుల కోసం రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాలకు 10 ట్రాక్టర్లను కూడా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఇతరులకు సేవ చేయడంలోనే నిజమైన శాంతి, సంతోషం లభిస్తాయని లారెన్స్ బలంగా నమ్ముతారు.
Raghava Lawrence
Lawrence Raghava
Kanmani Annadana Vindu
charity
social service
poor children
food donation
KPY Bala
tractor donation
Maatram organisation

More Telugu News