Boy: అమ్మ చదువుకోమంటోందని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలుడు

Boy Complains to Police About Mother Forcing Him to Study
––
తల్లి మందలించిందని పదకొండేళ్ల బాలుడు పోలీసులను ఆశ్రయించాడు. ఫోన్ చూడనివ్వకుండా పదే పదే చదువుకోమని సతాయిస్తోందని ఏకంగా ఏసీపీతోనే మొరపెట్టుకున్నాడు. బాలుడి ఫిర్యాదుతో ఆశ్చర్యపోయిన ఏసీపీ.. బాలుడి తల్లిని పిలిపించి ఆమె ఎదుటే బాలుడికి కౌన్సెలింగ్ ఇచ్చారు. విజయవాడలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు..

సత్యనారాయణపురం గులాబీతోట ప్రాంతానికి చెందిన ఓ మహిళకు ఇద్దరు కుమారులు. భర్తతో విభేదాల కారణంగా పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటోంది. తాను ఓ దుకాణంలో పనిచేస్తూ, పెద్ద కుమారుడిని మరో దుకాణంలో పనికి కుదిర్చింది. వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే ఇల్లు గడుపుతూ చిన్న కుమారుడిని చదివిస్తోంది. తాము ఇంటికి వచ్చే వరకూ చిన్న కుమారుడు ఒంటరిగా ఉంటాడనే ఉద్దేశంతో ఓ ఫోన్ కొనిచ్చింది. ఆరో తరగతి చదువుతున్న చిన్న కుమారుడు నిత్యం ఆ ఫోన్ తోనే గడపడం, చదువును నిర్లక్ష్యం చేయడం చూసి మందలించింది.

దీంతో కోపగించుకున్న బాలుడు నేరుగా వన్ టౌన్ కు వెళ్లి ఏసీపీ దుర్గారావుకు తల్లిపై ఫిర్యాదు చేశాడు. బాలుడి తల్లిని పిలిపించిన ఏసీపీ దుర్గారావు ఆ కుటుంబం పరిస్థితి తెలుసుకుని చలించిపోయారు. ఈ వయసులో చదువుకోకపోతే భవిష్యత్తులో ఎదురయ్యే కష్టాల గురించి బాలుడికి అర్థమయ్యేలా కౌన్సెలింగ్ ఇచ్చారు. తల్లి పడుతున్న కష్టాన్ని గుర్తించాలని, బాగా చదువుకోవాలని బాలుడికి నచ్చజెప్పి ఇంటికి పంపించారు.
Boy
Vijayawada
Student
Police Complaint
Mother
Education
Counseling
Child
Study
Phone Addiction

More Telugu News